అభిమానులకు గత రెండు నెలలుగా మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 2024 సూపర్ మజాను పంచింది. అదే మజాను నేడు జరిగే క్వాలిఫయర్-1నూ పంచడానికి సిద్దమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్-1 నేపథ్యంలో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఓసారి చూద్దాం.
ఐపీఎల్లో ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్‌కతా 17 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 పరుగుల తేడాతో గెలిచింది. సన్‌రైజర్స్‌తో గత తొమ్మిది మ్యాచ్‌ల్లో కేకేఆర్ ఏడు నెగ్గడం గమనార్హం. నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడడం ఈ జట్లకు ఇదే తొలిసారి. కోల్‌కతాపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 228 కాగా.. అత్యల్ప స్కోరు 116. హైదరాబాద్‌పై కోల్‌కతా అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101. ప్లేఆఫ్స్‌లో రెండు జట్ల రికార్డు దాదాపు ఒకే రకంగా ఉంది. కోల్‌కతా ప్లేఆఫ్స్‌లో ఎనిమిది నెగ్గి ఐదు ఓడిపోగా.. హైదరాబాద్ అయిదు గెలిచి, ఆరు ఓడింది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.
Discussion about this post