దిల్లీ, హరియాణాల్లో చీపురుకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్‌కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే.. ఏదైనా చేసే ముందు శత్రువులు 100 సార్లు ఆలోచిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దు చేసిందని, ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హరియాణాలోని అంబాలాలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శిస్తూ.. జీపు స్కామ్ ఆ పార్టీ హయాంలో జరిగిన మొదటి కుంభకోణమని చెప్పారు. గతంలో బాంబులు చేతపట్టిన పాకిస్థాన్ ఇప్పుడు అదే చేతులతో యాచిస్తోందని గుర్తు చేశారు.
దేశ ప్రజల భవిష్యత్తు అయిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి పనిచేస్తుందని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ పోల్ ర్యాలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ తెచ్చిన అగ్నీవీర్ పథాకన్ని తాము అధికారంలోకి వచ్చాక చెత్త బుట్టలో వేస్తామని, జీఎస్టీని సరళీకరిస్తామని అన్నారు. బడా వ్యాపారవేత్తలకు బదులు చిన్న వ్యాపారులకు అండగా నిలుస్తామని అన్నారు. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డిప్లోమాహోల్డర్లతో కూడిన లిస్టును తయారు చేస్తున్నట్టు చెప్పారు. వారికి తొలి ఉద్యోగం హక్కుగా కల్పిస్తామని, ఏటా రూ.1 లక్షల పారితోషికం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ వాళ్లు 5 కిలోల రేషన్ ఇస్తే తాము 10 కిలోల రేషన్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదు అన్నదానిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. దేశవ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని భావించినందుకే అని తెలిపారు. సోదరుడైన రాహుల్ గాంధీతోపాటు తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే అది బీజేపీకి లాభం చేకూర్చుతుందని ప్రియాంక గాంధీ అన్నారు. తాను గత 15 రోజులుగా రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నానని… గాంధీ కుటుంబానికి రాయబరేలీతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. అందుకే మేం ఇక్కడికి వచ్చి వారిని కలిసి మాట్లాడాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలువలేమని అన్నారు.
ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్ పై దాడి కేసులో ఢిల్లీ కోర్టు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌కు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.ఆప్ ఎంపీపై దాడి జరిగిందని, ఆమె షర్ట్ బటన్లు తొలగించినట్టు ఉందని, సీఎం నివాసం నుంచి తమకు కొంత సీసీటీవీ ఫుటేజీ కూడా లభించిందని పోలీసులు చెప్పారు. బిభవ్ ఫోన్ పాస్ వర్డ్ అడిగినా అతడు ఇవ్వలేదని అన్నారు. ఆధారాలు ధ్వంసం చేసేందుకు పోన్ ఫార్మాట్ చేశాడని ఆరోపించారు. అయితే, తన ఫోన్ హంగ్ కావడంతో ఫార్మాట్ చేయాల్సి వచ్చినట్టు బిభవ్ చెప్పినట్టు తెలిపారు. ముంబైలో నిపుణుల సాయంతో బిభవ్ సమక్షంలో అతడి ఫోన్ అన్ లాక్ చేయాల్సి ఉందని కాబట్టి, కస్టడీకి ఇప్పించాలని కోరారు. ఎంపీపై దాడికి గల కారణాలు వెలికి తీసేందుకు బిభవ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బిభవ్ కు ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది.
Discussion about this post