ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త ఘనత సాధించారు. గత పదేళ్ల కాలంలో 14 దేశాల జాతీయ అవార్డులను అందుకుని రికార్డు సృష్టించారు. తనదైన పాలన విధానం, రాజనీతిజ్ఞత, విదేశీ వ్యవహారాలను నడపడంలో చతురతతో ప్రపంచంలోని అన్ని దేశాల్లోను ప్రధాని నరేంద్ర మోదీ పేరు మారుమోగుతూ ఉంటుంది. ఈ క్రమంలో గత పదేళ్లలో 14 దేశాలు తమ జాతీయ అవార్డులతో ఆయనను సత్కరించాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
2014 లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 14 దేశాల అత్యున్నత జాతీయ అవార్డులను అందుకున్నారని విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ రాజ్య సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2018లో ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ అవార్డును ప్రధాని మోదీ అందుకున్నారని మురళీధరన్ వెల్లడించారు.
భారత ప్రధానికి వివిధ దేశాలు అత్యున్నత పురస్కారాలను అందించడం అనేది ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోదీ చూపించిన రాజనీతిజ్ఞతకు, నాయకత్వానికి స్పష్టమైన గుర్తింపు అని పేర్కొన్నారు. మోదీని వరించినవాటిలో.. ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు, పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలర్ పాలస్తీనా, ఐక్యరాజ్య సమితి నుంచి యూఎన్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఉన్నాయి.
అలాగే యూఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయెద్, రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ, మాల్దీవుల నుంచి ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్, బహ్రెయిన్ నుంచి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్, అమెరికా నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్, భూటాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్, ఫిజీ నుంచి ఆర్డర్ ఆఫ్ ఫిజీ, పపువా న్యూ గినియా నుంచి ఆర్డర్ ఆఫ్ లోగోహు, ఈజిఫ్ట్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది నైల్, ఫ్రాన్స్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్, గ్రీస్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ లను ప్రధాని మోదీ అందుకున్నారు.
Discussion about this post