బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తాను మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 10 రోజులలో నలందను సందర్శించడం భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో “శుభసూచకం” అని అన్నారు.మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే నలందకు వచ్చే అవకాశం నాకు లభించింది. ఇది శుభపరిణామం. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ఇది శుభసూచకంగా కూడా భావిస్తున్నాను.నలంద అంటే పేరు కాదని.. భారతదేశ ఆద్యాత్మిక, సాంస్కృతిక సమ్మిళితమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.
ఈరోజు రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు.నలందలోని పురాతన విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశంలో పునర్నిర్మాణం చేయబడింది . కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 40 తరగతి గదులు మరియు సుమారు 1900 సీటింగ్ సామర్థ్యంతో రెండు అకడమిక్ బ్లాక్‌లు ఉన్నాయి. ఇందులో రెండు ఆడిటోరియంలు మరియు విద్యార్థుల హాస్టల్ ౫౫౦ గదుల సామర్థ్యంతో ఉన్నాయి.455 ఎకరాల క్యాంపస్‌లో అంతర్జాతీయ కేంద్రం, యాంఫీథియేటర్, ఫ్యాకల్టీ క్లబ్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. నలంద యూనివర్సిటీ క్యాంపస్ ‘నెట్ జీరో’ గ్రీన్ క్యాంపస్. ఇది సౌరశక్తి, గృహ మరియు తాగునీటి శుద్ధి కర్మాగారాలు, నీటి రీసైక్లింగ్ ప్లాంట్ మరియు అనేక నీటి వనరులపై నడుస్తుంది.
ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అగ్నికీలలు పుస్తకాలను కాల్చవచ్చు.. కానీ జ్ఞానాన్ని మాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని నలంద పునరుద్ఘాటిస్తుందన్నారు.నలంద యూనివర్శిటీ పునఃస్థాపన భారతదేశానికి స్వర్ణయుగాన్ని సూచిస్తుందని, కొత్త క్యాంపస్ భారతదేశ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని అన్నారు.నలంద విశ్వవిద్యాలయం 2010లో పార్లమెంటు చట్టం ద్వారా తిరిగి నిర్మించబడింది . చట్టం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పేర్కొంది. భారత రాష్ట్రపతి విశ్వవిద్యాలయానికి సందర్శుకుడిగా, ప్రఖ్యాత ఆర్థికవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ విశ్వవిద్యాలయానికి మొదటి ఛాన్సలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం, ప్రముఖ ఆర్థికవేత్త అయిన అరవింద్ పనగారియా విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా ఉన్నారు.
రాజకీయంగా, నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో నలంద విశ్వవిద్యాలయం అభివృద్ధి మరియు ప్రారంభోత్సవాన్ని బిజెపి కీలక విజయంగా ప్రదర్శించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్నందున ఇది కూడా ముఖ్యమైనది. బీహార్‌లో నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ, బీజేపీ మిత్రపక్షాలు.. కానీ కేంద్రంలో జేడీయూ మద్దతుపై బీజేపీ ఆధారపడి ఉండడంతో ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. నలంద ప్రారంభోత్సవం సందర్భంగా, విశ్వవిద్యాలయం అభివృద్ధికి తోడ్పాటు అందించిన పొరుగు దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. నలంద కేవలం భారతదేశ వారసత్వానికే కాకుండా ఆసియా మరియు ప్రపంచ సామూహిక వారసత్వానికి కూడా పునరుజ్జీవనమని, విశ్వవిద్యాలయ ప్రాంగణ ప్రారంభోత్సవానికి అనేక దేశాల ప్రతినిధులు హాజరు కావడం అపూర్వమని విదేశీ ప్రముఖులను స్వాగతించారు.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ, “భారతదేశం తన విద్యా రంగాన్ని పునరుద్ధరిస్తోంది. భారతదేశాన్ని విద్యకు ప్రపంచ కేంద్రంగా మార్చడం, ప్రపంచంలోని అత్యంత ప్రముఖ జ్ఞాన కేంద్రంగా దాని గుర్తింపును తిరిగి పొందడం నా లక్ష్యం. అని ప్రధాని మోడీ అన్నారు .
2016లో నలంద యూనివర్సిటీని ఐక్యరాజ్య సమితి వారసత్వ ప్రదేశంగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సీఎం నితీశ్ కుమార్, నలంద యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అరవింద్ పనగారియాతోపాటు 17 దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు.
Discussion about this post