అభివృద్ది అంటే ముందుగా గుర్తుకొచ్చే అంశం రోడ్లు… రోడ్లు సరిగా ఉంటే రవాణా సదుపాయాలతో అభివృద్ధి పరుగులు పెట్టించవచ్చు. పరుగులు పెట్టించాల్సిన రోడ్లు చిద్రమైతే ప్రయాణం సాఫీగా సాగదు. అలాంటి చిద్రమైన రోడ్లకు చిరునామాగా నిలుస్తున్నాయి పలాస రోడ్లు.
ఒక్కసారి ఈ రోడ్డు చూడండి… ప్రధాన రహదారే… కానీ ప్రయాణం సాఫీగా సాగదు… కారణం రోడ్డుపై జల్లెడను మరిపించే తీరిలో గుంతలు… ఈ చిద్రమైన రోడ్డును చూస్తే జల్లెడకు కూడా అన్ని రంద్రాలు ఉండవేమో అనిపిస్తుంది. ఈ జల్లెడమయమైన రోడ్లు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పరిధిలోనివి. మంత్రిగా ఐదేళ్లలో నియోజకవర్గాన్ని భూతల స్వర్గం చేశానని సీదిరి అప్పలరాజు చెప్పే మటలకు ఏమాత్రం పోలిక లేవన్నట్లుగా కనిపిస్తున్నాయి ఈ రోడ్లు. ఏడేళ్ల క్రితం ప్రారంభించిన కాశీబుగ్గ పూండి రహదారికి నేటికీ మోక్షం లేకపోవడంతో వాహనాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఇక పలాస నియోజకవర్గం జిల్లాలో వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ ఆటోలు, సరుకు రవాణా ఆటోలు, ఆర్టీసీ బస్సులు, కార్లు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాలు నిత్యం ఇక్కడికి వస్తూ… పోతుంటాయి. పలాస నుంచి వజ్రపు కొత్తూరు మండలం పూండి అక్కుపల్లిని కలిపే రహదారి అతి ముఖ్యమైనది. ఈ రోడ్డును కలుపుతూ సుమారు వంద గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వందలాది గ్రామాలను సేవలందించాల్సిన ముఖ్యమైన రోడ్డు మాత్రం గుంతలతో చిద్రమైపోయింది.
సుమారు 16 కిలోమీటర్ల దూరం కలిగిన కాశీబుగ్గ నుండి పూండి అక్కపల్లి రహదారి పునరుద్ధరణకు 2017లో నాటి ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ కృషి చేశారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. అయితే ఈ పనులు చేసేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనిని మొదలుపెట్టి సగం మేర అంటే 9కోట్ల మేర పూర్తి చేశారు. 2019లో ఏపీలో అధికారం మార్పిడి కావడంతో ఈ పనులకు రివర్సు టెండరింగ్ కు మొగ్గు చూపడం జరిగింది. అప్పటికే 9 కోట్ల రూపాయల మేరకు పనులు చేపట్టిన కాంట్రాక్టరుకు కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే బిల్లులు చెల్లించడంతో పనులు నిలిచిపోయాయి.
చేసిన పనులకు నిధులు విడుదల కాలేదని పనుల్ని మధ్యలోనే వదిలేసి కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు. ఫలితంగా ఒకప్పుడు చిన్నగా ఏర్పడిన గుంతలు ఇప్పుడు పెద్దగా మారాయి. ఏడేళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈ ప్రధాన రహదారి ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేకుండా పోయింది. మరో మార్గంలేక ప్రయాణికులు ఈ చిద్రమైన రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
అయితే ఇదే విషయాన్ని ఇటీవల కొత్తగా ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అసెంబ్లీలో ప్రస్తావించారు. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పని కావడంతో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డును పక్కనబెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ సారి టీడీపీ అధికారానికి వచ్చింది. పైగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి చెందిన నాయకురాలే. ఆమె ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. దీంతో ఈ రోడ్డుకు మహర్థశ రావచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఇదీ పలాస ప్రధాన రోడ్డు దుస్థితి.
Discussion about this post