శ్రీకాకుళం జిల్లాలో 4,361 కోట్ల రూపాయలతో చేపట్టిన మూలపేట పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంత రూపు రేఖలు మారనున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను ప్రజాప్రతినిధుల బృందం, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, పోర్టు ఇంజినీర్లతో కలిసిపరిశీలించింది. శరవేగంగా జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ మూలపేట పోర్టు పూర్తి చేసి ఇక్కడే ఐదు వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ నగరంతో శ్రీకాకుళం పోటీ పడనుందని అన్నారు.
మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, ఇక్కడ జరుగుతున్న పనులే అందుకు నిదర్శనమని చెప్పారు. రూ.16వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయితే ప్రత్యక్షంగా 75వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలకు ఒక ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. పోర్టులు ఉన్న చోట్ల నగరాలు ఏర్పడతాయని తద్వారా అభివృద్దికి బాటలు పడతాయని చెప్పారు.
నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఏమిచ్చినా తక్కువేనని వారి త్యాగం మర్చిపోలేమని చెప్పారు. విశాఖ రాజధాని కల సాకారమైతే ఉత్తరాంధ్ర వెనుక బాటు తనం దూరమవుతుందని చెప్పారు.
Discussion about this post