హైదరాబాదు నగరానికి ఒకప్పుడు తాగునీరు , సాగునీరు అందించిన జీవనది మూసీ . మూసీ నది పశ్చిమం నుండి తూర్పునకు ప్రవహిస్తోంది . అనంతగిరిలో ప్రారంభమైన ఈ నది , దాని ఉపనదుల నీటిని నిల్వ చేయడానికి మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ మరియు మూసి ఉపనది ఈసా పై హిమయత్ సాగర్ లని పిలువబడే ఈ జంట జలాశయాల ను నాటి నిజాం రాజు నిర్మించారు. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉండే జంట జలాశయాల నుండి తూర్పు వైపు గౌరెల్లి వరకూ సుమారు 55 కిలోమీటర్లకు పైగా మూసీ నది నగరంలో ప్రవహిస్తోంది.
నానాటికీ పెరిగిన పట్టణీకరణ కారణంగా ఈ 55 కిలోమీటర్ల ప్రాంతం అర్బన్ జింగిల్ గా మారిపోయి ఎన్నో కాలనీలు, బస్తీలకు ఆవాసంగా మారి పోయింది. బాపూ ఘాట్ నుండి మొదలు పెడితే నాగోల్ వరకూ మూసీ నదికి ఇరువైపులా పాత బస్తీలోని పలు ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ నిబంధనలకు విరుద్దంగా నదీ గర్భంలోనికి చొచ్చుకు వచ్చి కట్టడాల నిర్మాణాలు పెరిగి పోయాయి . పెరిగిన ఆక్రమణలు, పట్టణీకరణ కారణంగా వెలువడుతున్న కాలుష్యాల కారణంగా మూసీ నది నీటి ప్రవాహం పూర్తిగా మురుగు కాలువ కన్నా అధ్వాన్నంగా తయారైందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. క్రమంగా మూసీ హైదరాబాదు నగరానికి చెందిన ఒక పెద్ద మురికి కాలువగా మారిపోయింది. మూసీ నది వెదజెల్లే దుర్గంధం ఎప్పటి నుండో ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది.
ఒకప్పుడు నగరానికి జీవనాధారమైన మూసీనది పరివాహక ప్రాంతాలను ఆక్రమించడంలో ప్రభుత్వమే ప్రధాన పాత్ర పోషించింది, దీనికి ఉదాహరణలు అనేకం . ఇమ్లిబన్ బస్సు స్టాండ్,మెట్రో స్టేషన్ నిర్మాణం లాంటివి ఎన్నో …. గత ప్రభుత్వాల హయంలో వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆస్ట్రేలియన్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రబ్బర్ డ్యామ్, చెత్తను గ్రీన్ ఎనర్జీ గా మార్చే వేస్ట్ టో ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం ఇవేమీ మూసీ కలుషితం కాకుండా ఆపలేక పోయాయి .
రాజశేఖర్ రెడ్డి హయాంలో కోట్ల రూపాయలతో నిర్మించిన రబ్బర్ డ్యామ్ దోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మూసీ నది ప్యూరిఫికేషన్ ప్లాన్ ను అమలు చేస్తామని , ఇది హైదరాబాద్ నెక్లస్ రోడ్ కు ధీటుగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని తీర్చు దిద్దుతామని వందల కోట్ల రూపాయల ప్రజా ధనంతో పనులు మొదలు పెట్టినా… ఈ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ నిర్మాణం అరకొర పనులతో డబ్బంతా మూసీలో పోసిన పన్నీరు చందం మారింది .
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లక్ష్యాన్ని సాధించలేకపోగా …సుందరీకరణ కోసం ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసినా
ప్రభుత్వాల అసమర్థత, భవిష్యత్తు ప్రణాళిక లోపాల వల్ల నిరుపయోగంగా మారింది. నది ప్రక్షాళన విషయానికొస్తే ముఖ్యంగా గతంలో 30-40 అడుగుల లోతు ఉండే ఈ నది వ్యర్ధ పదార్తాలు, చెత్త వేయడంతో లోతు తగ్గిపోయి నదిని శుభ్రపరచడం, అభివృద్ధి చేయడానికి కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అయ్యాయి .
మరో వైపు ప్రభుత్వం మూసీనది దగ్గర చెత్తను శుభ్రపరిచి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది. భవిష్యత్తు ప్రణాళిక లోపాల వలన ఈ ప్రాజెక్ట్ కూడా ప్రభుత్వం అనుకున్నట్టుగా ఉపయోగకరంగా లేకపోవడం గమనార్హం. చెత్తతొ తయారు అయ్యే విద్యుత్ కన్నా అక్కడ విడుదలయ్యే పొగ, విద్యుత్ తయారీ తరువాత మిగిలే బూడిద మరో సమస్య కు కారణం అవుతున్నాయి . వాస్తవానికి విద్యుత్ తయారీ తరువాత మిగులు బూడిదను ఇటిక తయారీకి ఉపయోగించ వలసి ఉంది, కానీ బూడిద మూసి నదిలోనే వదుల్తున్నట్టు వాదనలు ఉన్నాయి. అనాలోచిత నిర్ణయాలు , అలసత్వం పరస్పర అవగాహనా లోపాల వలన మూసీ నది ప్రక్షాళన , సుందరీకరణ ఎప్పటికి జరిగేనో, ప్రజల కల నెరవేరేనో వేచి చూడాలి .
Discussion about this post