దివంగత నేత .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి, అలాగే తనయురాలు షర్మిల త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. వైఎస్ షర్మిల పెట్టిన YSRTP పార్టీ తరపున ఈ ఇరువురు ఎన్నికల బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి విజయలక్ష్మి .. మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీచేసే అవకాశాలు కనబడుతున్నాయి. తొలుత షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తుందని భావించారు. అయితే షర్మిల మిర్యాలగూడ స్థానాన్నిఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.
మిర్యాలగూడ ఆంధ్ర బోర్డర్ కాబట్టి అక్కడ సెటిల్ అయిన ఆంధ్ర ఓటర్ల నుంచి అనుకూల ఓటు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్థానంపై సర్వే కూడా చేయించినట్టు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ,బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా బరిలోకి దిగుతారు. త్రిముఖ పోటీ జరుగుతుంది. ఇక పాలేరు నుంచి విజయమ్మ పోటీకి దిగినా త్రిముఖ పోటీ నే అవుతుంది. కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయడం ఖరారు అయినట్టే. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ బరిలోకి దిగుతారు.
విజయలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా చేశారు. వైఎస్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో విజయమ్మ గెలిచారు. ఆమె కుమారుడు జగన్.. కాంగ్రెస్ ను వీడి వైసీపీని పెట్టినప్పుడు.. విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీకి, పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పులివెందుల నుంచి ఆమె తిరిగి ఎన్నికయ్యారు. అయితే 2014 ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ చేయగా..విజయమ్మ విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచి 90,488 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు. తెలంగాణలో YSR పాలన లక్ష్యంగా ఆమె కూతురు షర్మిల.. YSRTP పెట్టిన తర్వాత వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. అప్పటి నుంచీ విజయమ్మ తెలంగాణలో షర్మిలకు అవసరమైన సహకారం అందిస్తూ వస్తున్నారు.
కొద్దీ రోజుల క్రితం షర్మిల తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా విలీనానికి సిద్ధమైనారు. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు ఆంధ్రా కాంగ్రెస్ లో చేర్చుకుంటాం ..అక్కడ ప్రాధాన్యత ఇస్తాం .. ఇక్కడ ఇవ్వలేం అన్నారు. దీంతో షర్మిల మనసు మార్చుకుని తెలంగాణలోనే పోటీ చేయబోతున్నారు. పార్టీ తరపున ఎన్ని స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తారనే విషయం ఇంకా ఖరారు కాలేదు. ఒకటి రెండు రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి
























Discussion about this post