నల్లమల అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగుతోంది. శ్రీశైల క్షేత్రానికి వెళ్లే రహదారులు ఆసాంతం శివస్వాములతో కళకళలాడుతున్నాయి. ఈ నెల 8న మహా శివరాత్రి సందర్భంగా అప్పటి వరకు క్షేత్రానికి చేరుకోవాలని శివ స్వాములు కాలినడకన తరలి వెళ్తున్నారు. వేల సంఖ్యలో స్వాముల రాకతో దట్టమైన నల్లమల అడవి శివ నామస్మరణతో మారుమోగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా స్వాములు తరలి వస్తున్నారు. మార్గ మధ్యలో చెట్టు, పుట్ట, రాయి, రప్ప అనే తేడా లేకుండా కటిక నేలపై సేద తీరుతున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా వారం ముందు నుంచే ఉమ్మడి పాలమూరులోని నల్లమల ప్రాంతంలో పండుగ శోభ సంతరించుకున్నది. హిందువులందరికీ శివరాత్రి ఎంతో ముఖ్యమైన పండుగ. ఉపవాస దీక్షలతో పాటుగా శివాలయాల్లో పూజలు చేసుకొని భక్తిని చాటుకొంటుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రం, పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండోది శ్రీశైలం. శ్రీ భ్రమరాంబదేవికి నెలవైన శక్తిపీఠంగా భాసిల్లుతున్నది.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి 130కిలో మీటర్లు, పాలమూరు నుంచి 180కిలో మీటర్ల దూరంలో క్షేత్రం ఉన్నది. మహాశివరాత్రి పర్వదినాన వేలాది భక్తులు క్షేత్రానికి తరలివెళ్తుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటుగా కర్ణాటక నుంచి సైతం వేలాది మంది శివరాత్రి వరకు చేరుకునేందుకు పాదయాత్రగా బయలు దేరుతుంటారు. తమతమ ప్రాంతాల నుంచి పండుగ వరకు చేరుకునే రోజులను బట్టి శివ భక్తులు కాలినడకను ఆరంభిస్తారు. ఇలా పది రోజుల ముందు నుంచే కర్ణాటకకు చెందిన శివ భక్తులు పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరారు.
పాదయాత్ర చేసే శివస్వాములకు భక్తులు ఏళ్లుగా అన్నదానం చేస్తున్నారు. పండ్లు అందజేస్తున్నారు. స్వాములకు సేద తీరడానికి అక్కడక్కడ టెంట్లను ఏర్పాటు చేసి స్వామివారి సేవలో నిమగ్నం అవుతున్నారు. తద్వారా తమ భక్తిని చాటుకుంటున్నారు.
Discussion about this post