ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ఎన్నికల రణక్షేత్రంలోకి దూకింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో అన్ని రాజకీయ పార్టీలకన్నా ముందుగా తమ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అని మాజీ సీఎం, తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకూ ఖమ్మం పార్లమెంటుకు 17 సార్లు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావుదే అత్యుత్తమ విజయం. 2019 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు ఉమ్మడి జిల్లాలో పదికి గాను తొమ్మిందింట ఓటమి చెందగా ఒక్క పువ్వాడ అజయ్‌కుమార్ మాత్రమే విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్ ఎంపీగా బరిలో దిగిన నామ నాగేశ్వరావు ఏకంగా 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. తెలంగాణలోని బీఆర్‌ఎస్ ఎంపీల ప్రతినిధిగా లోక్‌సభలో ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణులు, ముఖ్యంగా కీలక నేతలంతా ఐక్యంగా పనిచేసి ఎంపీ నామ విజయం కోసం అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అశ్వారావుపేటలో జరిగే ముఖ్యనేతల సమావేశంతో ఎంపీ ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అదే రోజు సాయంత్రం చింతకాని మండలంలోని పొద్దుటూరు గ్రామంలోమండల స్థాయి బీఆర్‌ఎస్ ముఖ్యనేతల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశాలకు బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తదితర ముఖ్యనేతలు పాల్గొంటున్నారు. ఇక నుండి ఉమ్మడి జిల్లాలోని అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం, వైరా, మధిర, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించుకుంటూ బీఆర్‌ఎస్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
పార్లమెంటులో సీనియర్ నాయకునిగా ముద్ర పడిన నామ నాగేశ్వరరావు విజయం పెద్ద కష్టమేమీ కాదన్నట్టుగా బీఆర్‌ఎస్ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తొలి ఓటు వేసిన నామదే విజయం అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధిగా, ఎంపీగా నామ నాగేశ్వరరావు ఇప్పటికే రెండు పర్యాయాలు పార్లమెంటరీ పార్టీ నేతగా పని చేశారు. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎంపీగా నామ నాగేశ్వరరావు రికార్డు విజయాన్ని నమోదు చేశారు. గడిచిన ఐదేండ్లలో పార్లమెంటరీ పార్టీనేతగా అనేక అంశాలపై తన గళం విప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, జాతీయరహదారులు, గిరిజన యూనివర్సిటీ, పీఎంజీఎస్‌వై, స్పెషల్ గ్రాంట్లు తీసుకురావడానికి నామ అనేక రకాలుగా పోరాడారు. ఖమ్మం ఎంపీగా నామ ను గెలుపించుకునేందుకు గాను బీఆర్‌ఎస్ శ్రేణులన్నీ సిద్దంగా ఉన్నాయి. నామ గెలుపు ఖాయమని పార్టీ అధ్యక్షులు తాతా మధు అన్నారు.
ప్రస్తుతం ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన సీపీఐ గెలుచుకున్నాయి. కానీ గడిచిన ఎన్నికల్లోనూ ఎంపీ అభ్యర్ధికి జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఓటమి చెందినప్పటికీ 2019లో నామ పార్లమెంటు చరిత్రలోనే అత్యధిక రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్నారు. అజాత శత్రువుగా, నిరాడంబరునిగా, నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పేరున్న నామ నాగేశ్వరరావు ఈ సారి ఎన్నికల్లో ఒక విధంగా పెద్ద యుద్ధాన్నే గెలవాల్సి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పైకి బలమైన శక్తిగా కనిపిస్తున్న కాంగ్రెస్ అందులోనూ కాకలు తీరిన ముగ్గురు మంత్రులు తుమ్మల, పొంగులేటి, భట్టి విక్రమార్కకు దీటుగా బీఆర్‌ఎస్ తన ఎన్నికల కార్యాచరణను అమలు చేసేందుకు యుద్ధానికి సిద్ధం అవుతోంది.






















Discussion about this post