అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు..| Nampally Court Shock to Allu Arjun

హైదరాబాద్‌ను ఒక్కసారిగా ఊపేసిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు నాంపల్లి కోర్టు విచారణతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసుపై సోమవారం న్యాయస్థానంలో కీలక విచారణ జరగ్గా.. నిందితుల జాబితాలో ఉన్న పలువురు జడ్జ్ ముందు హాజరయ్యారు. అయితే అందరూ ఎంతగానో ఎదురుచూసిన స్టార్ హీరో అల్లు అర్జున్ మాత్రం కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కోర్టుకు రాలేకపోయారు.

ఈ విషయాన్ని బన్నీ తరఫు డిఫెన్స్ లాయర్ న్యాయస్థానానికి వివరిస్తూ.. ఆయన గైర్హాజరుకు గల కారణాలను జడ్జ్‌కు సమర్పించారు. నిజానికి విచారణకు ఐకాన్ స్టార్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ గతంలోనే సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఇరువర్గాల అప్‌డేట్స్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఈ హైప్రొఫైల్ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్‌ను ఏకంగా A11 నిందితుడిగా చేర్చడం అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. మరోవైపు సంధ్యా థియేటర్ మేనేజ్‌మెంట్‌ను A1 నుంచి A10 నిందితులుగా మారుస్తూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మొత్తం 23 మందిపై పోలీసులు పక్కా ఆధారాలతో కోర్టులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. వీరిలో ఇప్పటికే 19 మందికి కోర్టు నుంచి అఫీషియల్ సమన్లు వెళ్లాయి. ఈ కేసులో ఉన్న నిందితులందరి వ్యక్తిగత హాజరు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే.. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణను వేగవంతం చేసేందుకు నాంపల్లి కోర్టు రంగం సిద్ధం చేస్తోంది.

ఇక ఈ దారుణ ఘటన ఫ్లాష్‌బ్యాక్ చూస్తే.. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ వద్దకు అభిమానులు ఊహించని స్థాయిలో పోటెత్తారు. ఆ సమయంలో జనాలను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాకపోవడంతో అక్కడ భయంకరమైన తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దారుణమైన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ ప్రాణాపాయ స్థితిలో గాయపడ్డాడు. ఈ విషాదంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘించిన వారందరినీ చట్టం ముందుకు తెచ్చారు. అటు సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో జులై 6న ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top