మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి మన బిడ్డలకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం ? అని ఆయన ప్రశ్నించారు.
దుగ్గిరాల మండలం మంచికలపూడిలోని కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో యువనేత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అనంతరం అక్కడి కార్మికులను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ… పరిశ్రమల ఏర్పాటు విషయంలో మెరుగైన పాలసీ తీసుకువస్తాం. ఒక్క పరిశ్రమ వస్తే అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయి. అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను తీసుకువస్తే, దానికి అనుబంధంగా వందలాది పరిశ్రమలు వచ్చాయి. దీంతో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. మంగళగిరిలో 1లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే మా లక్ష్యం అన్నారు.
ఆనాడు హైదరాబాద్ లో చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మించినప్పుడు కంప్యూటర్లు అన్నం పెడతాయా అని హేళన చేశారు. నేడు 15 లక్షల మంది ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. పన్నుల భారంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని, మన పార్లమెంట్ ను అభివృద్ధి చేస్తారో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని లోకేష్ కోరారు.
రానున్న 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా సంకల్పం, ఇందుకు కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ప్రతినిధులు కూడా తమ సంస్థను విస్తరించి, అదనపు ఉద్యోగాల కల్పనకు కృషిచేయాలని కోరారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఎక్కువ ఉద్యోగాలిచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు, అవసరమైన అన్ని సహాయ, సహకారాలు రాబోయే ప్రజాప్రభుత్వంలో తాము అందిస్తామని లోకేష్ చెప్పారు.
Discussion about this post