ఫిజిక్స్ లో ‘నోబెల్’, దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అందుకున్న ఏకైక వ్యక్తి ఎవరో మీకు తెలుసా ? ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి శ్వేతజాతీయేతర, ఆసియావాసి.. భారతీయుడు కూడా ఆయనే .. ఆయన తన పరిశోధనా వ్యాసాన్ని సమర్పించిన ఫిబ్రవరి 28 ను జాతీయ విజ్ఞాన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. గుర్తు వచ్చిందా ? ఆయనే ‘రామన్ ఎఫెక్ట్’ కనిపెట్టిన చంద్రశేఖర వెంకటరామన్. మనం సీవీరామన్ అని ఆయనను పిలుచుకుంటాం. ఇంతవరకు ఆయనను మాత్రమే ఆ రెండు అత్యున్నత అవార్డులు వరించాయి. VOICE:
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబరు 7న తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడంతో.. ఆ వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ తో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1907లో ఫిజిక్స్ ఎం.ఎస్.సి లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు.
సీవీ రామన్ 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై రాసిన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని గుర్తించిన అధ్యాపకులు రామన్ ను ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని వైద్యుడు తేల్చడంతో ప్రయాణాన్ని విరమించుకున్నారు.
ఆపై ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్‌తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌ బజారు స్ట్రీట్ వద్ద ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ IACS బోర్డు చూసి అక్కడికి వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతి పొందారు.
పరిశోధనలపై ఉన్న ఆసక్తితో తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్‌కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన చేసేవారు. ఆదివారాలు, సెలవు దినాలు కూడా పరిశోధనల్లోనే గడిచేవి. పదేళ్లపాటు ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అక్కడ నుండి తన విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించడానికి 1921లో సముద్రయానం ద్వారా లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి వెళ్ళాడు.
ఆ మహనీయుని పరిశోధనలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో మన దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అవార్డు ప్రకటించింది. ఆయన సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ ‘విజ్ఞాన శాస్త్ర సారాంశం.. ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధిస్తాయి’ అన్న మాటలు నేటికీ విద్యార్థులను ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. 1957లో అప్పటి సోవియట్ రష్యా లెనిన్ శాంతి బహుమతిని సీవీరామన్ కు బహూకరించింది. వాస్తవానికి దీన్ని ప్రసిద్ద కమ్యూనిస్టులకు, లేదా కమ్యూనిస్టు మద్దతుదారులకు ఇస్తారు. 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించి భారత ప్రభుత్వం ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా చేసింది.
Discussion about this post