ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ‘నీలాద్రి అర్బన్ పార్క్’లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ప్రతి ఏటా అర్బన్ పార్క్ లో ఉన్న చుక్కల దుప్పులు పలు కారణాలతో మృత్యువాత పడుతున్నాయి. వాటికి రక్షణ కల్పించే విషయంలో అటవీ శాఖ మీనమేషాలు లెక్కిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్కు పడమర వైపున ఉన్న సింగరేణి బొగ్గు గని కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని అటవీ శాఖ చెబుతుండగా … అది తమకు సంబంధం లేదని సింగరేణి సంస్థ అధికారులు అంటున్నారు. పార్క్ లోకి విచ్చలవిడిగా వీధి కుక్కలు చొరబడి చుక్కల దుప్పుల పై దాడులు చేసి గాయపరుస్తుండటంతో చనిపోతున్నాయి.నీలాద్రి అర్బన్ పార్క్’లో వరుసగా మృత్యువాత పడుతున్న వన్యప్రాణుల పై 4 sides tv ప్రత్యెక కథనం….
సత్తుపల్లి పట్టణంలోని వేంసూర్ రోడ్డులో 390 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అర్బన్ పార్ను ఏర్పాటు చేయాలని 2018లో నిర్ణయించారు. కాలక్రమంలో ఈ పార్క్ ను అభివృద్ధి చేశారు. దీనికి సింగరేణి సంస్ద, సత్తుపల్లి మునిసిపాలిటీ అటవీ శాఖలు నిధులు ఖర్చు చేశారు. పార్కు రెండు వైపులా ఇనుప మెస్ తో కూడిన ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. పార్కు పడమర వైపున సింగరేణి ఓపెన్ కాస్ట్ డంపింగ్ గుట్ట ఉండటంతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. పార్క్ లో రహదారులు నిర్మించి వన్యప్రాణుల కోసం నీటి చెరువులను తవ్వించారు. వాచ్ టవర్ నిర్మించారు. పార్క్ ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దినప్పటికీ …. వన్యప్రాణులకు సరైన రక్షణ కల్పించ లేకపోయారు.అర్బన్ పార్క్ ను సందర్శకులకు, వాకర్స్ కు అనుకూలంగా తీర్చిదిద్దారు.అయితే వన్యప్రాణులకు రక్షణ చర్యలు మాత్రం అంతంతమాత్రంగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. సాధారణంగా వన్యప్రాణుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆటవీశాఖ అధికారులు పటిష్ఠ మైన చర్యలు తీసుకోకపోవడంతో చుక్కల దుప్పులు మృత్యు వాత పడుతున్నాయి.
పార్క్ లో 300 వరకు చుక్కల దుప్పులు ఉంటాయని అంచనా. పార్క్ కి సమీపం లో ఉన్న వెంగళరావునగర్, జలగం నగర్ ల నుంచి వీధి కుక్కలు ప్రవేశించి దుప్పులపై దాడి చేస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన దుప్పులకు పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో చికిత్స చేసి కిన్నెరసానిలోని అభయారణ్యంలోకి పంపుతున్నారు. కొన్ని దుప్పులు వైద్య సహాయం అందించే లోపే చనిపోతున్నాయి.కొన్ని దుప్పులు పార్క్ నుంచి బయటకు వచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోగా …… ఒక దుప్పి గతేడాది వెంగళరావు నగర్ నివాస ప్రాంతంలోకి వచ్చి బావిలో పడి చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఇలా పలు రకాల కారణాలతో దుప్పులు నిత్యం మృత్యువాత పడటం రివాజుగా మారింది.వన్యప్రాణులను కాపాడేందుకు అదికారులు యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
పదుల సంఖ్యలో దుప్పులు పలు కారణాలతో మృత్యువాత పడుతున్నా ఇప్పటివరకు పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పార్క్ బయట నుంచి వీధి కుక్కలు పార్క్ లోకి రావడం, పార్క్ లోని దుప్పులు బయటకు పోవడాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫెన్సింగ్ లేని ప్రాంతాలలో బయట నుంచి వీధి కుక్కలు లోపలికి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ సింగరేణి సంస్థ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది పార్క్ లో గస్తీ తిరుగుతున్నారంటూ అధికారులు చెబుతున్నారు. 390 ఎకరాల అటవీ విస్తీర్ణంలో గస్తీ తిరగడం వలన ఏ మేరకు ఫలితం ఉంటుందనేది ప్రశ్నార్ధకం. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ పడమర వైపు ఉన్న కారణంగా పెన్సింగ్ వేయలేక పోతున్నామని ఆటవీ అధికారులు చెబుతున్నా దానిని సింగరేణి అధికారులు ఖండిస్తున్నారు. మొత్తంగా ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి మరిన్ని దుప్పులు మృత్యువాత పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Discussion about this post