NEET UG 2026: ఇదేందయ్యా ఇదీ..! పరీక్ష రాసేందుకు ‘నీట్‌’గా వస్తే.. జడలు విప్పి పంపించారు!

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌-యూజీ 2026) ఆదివారం (మే 3) ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్‌‌టిఎ) దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించింది..

హైదరాబాద్‌, మే 4: నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష ఆదివారం (మే 3) ప్రశాంతంగా జరిగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22, 75,001 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 22,09,318 మంది ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో రాశారు. అంటే 97 శాతం మంది పరీక్ష రాశారు. తమిళనాడులో అత్యధికంగా 1.4 లక్షల మంది రాశారు. దేశంలోని 552 నగరాల్లో, విదేశాల్లోని 14 సిటీల్లో కలిపి మొత్తం 5,432 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేశారు. పలు కేంద్రాల్లో కొందరు అభ్యర్థులు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు మరిచిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులకు అన్ని కేంద్రాల్లో తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఉండటంతో విద్యార్ధులను ఉదయం 11 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. బయోమెట్రిక్‌ తీసుకోవడం ఆలస్యమవుతుందని మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలైనప్పటికీ గంటన్నర ముందుగానే విద్యార్థులకు బయోమెట్రిక్‌ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగడంతో విద్యార్థుల కోసం తల్లిదండ్రులు, వారి బంధువులు బయట చెట్ల కింద సేదతీరాల్సి వచ్చింది.

మరోవైపు కఠిన నిబంధనల మధ్య నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించడంతో పలు పరీక్ష కేంద్రాల వద్ద వింత దృశ్యాలు కనిపించాయి. అమ్మాయిలు ధరించిన నగలు, వాచ్‌లతో పాటు జడలకు వేసుకున్న రబ్బర్‌ బ్యాండ్‌లు, క్లిప్‌లను సైతం పరీక్ష నిర్వహకులు తొలగించారు. దీంతో ‘నీట్‌’ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులు పరీక్ష కేంద్రానికి నీట్‌గా వచ్చినప్పటికీ తనిఖీల సమయంలో చివరకు జడలు కూడా విప్పించారు.

దీంతో పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధినులు జడలు విప్పుకుని జుట్టు విరబోసుకుని కనిపించారు. అన్ని ఆభరణాలతోపాటు జడల రబ్బర్‌లు, క్లిప్‌లు కూడా తీసి వేయించి పరీక్ష కేంద్రాల్లోకి పంపారు. కాగా నీట్ యూజీ 2026 ఫలితాలు జూన్‌లో వెలువడనున్నాయి. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Follow for more Updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top