పార్టీ అధినేత నిరంకుశత్వ ధోరణిని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి భరించలేకపోతున్నారని, ఆయన రూటు వైసీపీ నుంచి టీడీపీకి మారుతోందంటూ 4 సైడ్స్ టీవీ ముందే చెప్పింది. ఇప్పుడదే జరిగింది. రాజకీయాలలో విలువలను పాటించే మనస్తత్వం ఉన్నవారు అధినేత నిరంకుశత్వ ధోరణిని, బస్తీమే సవాల్ అంటూ కయ్యానికి కాలు దువ్వే ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి పయనించడం అసాధ్యం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయ ముఖచిత్రం అదే ! ఈ నేపథ్యంలో ఆర్ధికంగా బలమైన నాయకుడైన వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి వైసీపీలో ఇమడలేకపోయిన కారణాలపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఎన్నికల ముందు రూటు మార్చిన వీపీఆర్.. వ్యూహాత్మక సమీకరణాలతో రాజకీయం సాగించేందుకు పావులు కదుపుతున్నారు. అధికార వైసీపీని వీడి టీడీపీ పక్షం వహిస్తున్న ఆయన.. జిల్లాలో ప్రథమ ప్రాధాన్యం, పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి మండలిలో చోటు కోరుతూ సరికొత్త రాజకీయానికి తెరతీశారు. చంద్రబాబు సమక్షంలో తన కళ్యాణ మండపం నుంచే సతీమణితో కలిసి వీపీఆర్ సరికొత్త రాజకీయ సినారేను అవిష్కరించనున్నారు. టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
ప్రజల్లో ఒకరిగా ఉంటూ ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధి స్థానానికి ఇప్పుడు నిర్వచనం మారిపోయింది. అందరూ తన అధిపత్యానికి లోబడి ఉండాలని వారు భావిస్తున్నారు… ఆశిస్తున్నారు. అందివచ్చిన పార్టీని ప్రలోభపెట్టి .. క్యాడర్ ను ఆకట్టుకుని, కాని పక్షంలో కొనేసయినా అభ్యర్థిత్వాన్ని సాధించి పదవిని కైవసం చేసుకోవడం షరా మామూలైంది. ప్రలోభాల స్థాయి, ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఏకంగా మంత్రి మండలిలో స్థానం దక్కుతుండటంతో అలాంటి నేతల కల సాకారమౌతోంది. ఒక్కసారి రాజకీయంగా ఉన్నత స్థాయిని పొందితే ఉండే మజా మాటల్లో చెప్పలేనిది.
ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి లాంటి నేతల రాజకీయ సినారే వేరు. వీరు రాజకీయంగా పదవులను అధిరోహించకపోయినప్పటికీ కాంట్రాక్టరుగా సాధించిన నైపుణ్యం, సాధించిన ఆర్థిక స్థితి, సొంత నిధులతో చేపట్టిన విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తమను ఆశ్రయించిన వారిని ఆదుకోవడం వంటి కారణాల వల్ల ప్రత్యేక వ్యక్తులుగా మంచి గుర్తింపు ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో వీరు సాగిస్తున్న ధార్మిక కార్యక్రమాల ఫలితం వీరికి మంచి మార్గాన్నే చూపుతుంటుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వీపీఆర్ ప్రజా ప్రతినిధిగా స్థానాన్ని పొందే విషయంలో దైవ ఆశీస్సులు మెండుగా ఉంటాయన్న విశ్వాసం లేకపోలేదు. వ్యక్తి ప్రాధాన్యానికి దాసోహమనే చోట.. వీరు తలవంచి రాజకీయ ప్రయోజనాలను అందుకోవాల్సిన దుస్థితి నుంచి ధార్మిక కార్యాక్రమాల ఫలితం వీరిని కాపాడుతూనే ఉంటుంది.
Discussion about this post