ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్ చట్టం-2025ను నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టం సిద్ధమయ్యింది. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపు, విదేశీ విహార ప్యాకేజీలు, విద్య-వైద్యం నిమిత్తం విదేశాలకు పంపే మొత్తంపై పన్ను తగ్గింపు.. ఇలా ఎన్నో కీలక నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

పన్ను విధానాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా మార్చడమే కొత్త చట్టం లక్ష్యం. దీనిలో అసెస్‌మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనే వ్యత్యాసాలను తొలగించి, ఒకే ‘ట్యాక్స్ ఇయర్’ విధానాన్ని తీసుకొచ్చారు. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినప్పటికీ, ఎలాంటి జరిమానా లేకుండా, టీడీఎస్ రిఫండ్ క్లెయిం చేసుకునే వెసులుబాటు కల్పించారు.

2026 జులైలో దాఖలు చేసే ఐటీఆర్‌లు పాత చట్టం నిర్దేశించిన ఫార్మ్ ప్రకారమే సమర్పించాల్సి ఉంటుంది. 2026 జూన్ నుంచి చెల్లించే ముందస్తు పన్ను మాత్రం కొత్త చట్టం ప్రకారం చెల్లించాలి. ఈ మార్పుల నేపథ్యంలో పాత, కొత్త చట్టాలకు సంబంధించిన సేవలను ఐటీ శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ పారదర్శకంగా అందిస్తుందని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది.
2026-27 సంవత్సరానికి ఆదాయపు పన్ను విభాగం మొత్తం 7 ఐటీఆర్ ఫారాలను నోటిఫై చేసింది. మార్చి 30న చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ 1, 4 ఫారాలను జారీ చేయగా, మిగిలిన ఐటీఆర్ 2, 3, 5, 6, 7తో ఇప్పటికే అప్‌డేటెడ్ రిటర్న్స్ ఫారాలనూ నోటిఫై చేసింది. ఆడిట్ అవసరం లేని వారికి ఐటీఆర్ దాఖలు చేసేందుకు జులై 31 వరకు గడువు ఉంది.ఐటీఆర్-1 అంటే వార్షికాదాయం 50 లక్షల రూపాయల లోపు ఉండి, వేతనం, ఒక ఇంటిపై ఆదాయం పొందేవారు సహజ్ దాఖలు చేయాలి.ఇక ఐటీఆర్-4 చూస్తే వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వారు సుగమ్ సమర్పించాలి. అలాగే, వ్యాపార లాభాలు లేకుండా వర్కింగ్ క్యాపిటల్ ద్వారా లాభాలు పొందేవారు ఐటీఆర్-2, సొంత వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందేవారు ఐటీఆర్-3, సంస్థలు, ఎల్‌ఎల్‌పీలు ఐటీఆర్-5, కంపెనీలు ఐటీఆర్-6, ట్రస్టులు ఐటీఆర్-7 ఫారాలను ఉపయోగించాలి.
