ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలో వైఎస్ షర్మిల రెండో రోజు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి ఇప్పుడు దగా డీఎస్సీ ఇచ్చారని పలు బహిరంగ సభల్లో షర్మిల విమర్శిస్తున్నారు. ఎన్నికలు 2 నెలలు ఉందనగా ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడు ఆరు నెలలు మాత్రమే నిద్రపోతాడు, సీఎం జగన్ మాత్రం అయిదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు సిద్దమంటూ నిద్రలేచారని వివిధ సభలలో ఎద్దేవా చేశారు. గతంలో పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లే అడగాను అని చెప్పి ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతోందని మండిపడ్డారు.
——–
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడించేందుకు ప్రత్యర్థులు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ ఆరోపిస్తున్న మెగాబ్రదర్ నాగబాబు.. తాజాగా జనసేన ప్రత్యర్థులకు మరో వార్నింగ్ ఇచ్చారు. సామాన్యులపై కూడా బెదిరింపులు వస్తున్నాయన్న ఆయన ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గీత అనే మహిళకు కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడంటూ ఆయన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్‌ను షేర్ చేశారు. ఈ ఆడియోలో.. అవతలి వ్యక్తి.. గీతను పవన్ మాటలు వినొద్దనడం, ఆమె తాను స్వతంత్ర అభ్యర్థిగా వేశానని చెప్పడం వినొచ్చు. పిఠాపురంలోకి కడప నుంచి గుండాలను దింపుతున్నారనడానికి ఇదో నిదర్శనమని నాగబాబు అన్నారు. ఓ మహిళ పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయకూడదా? అని ప్రశ్నించారు.
———-
ఐదేళ్ల వైసిపి పాలనలో అనంతపురం నగరంలోని పార్కులు, స్టేడియాలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని అనంతపురం అర్బన్ టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ లో ప్రచారం నిర్వహించారు. వాకర్స్ తో కలిసి చాలాసేపు వ్యాయామం చేశారు. అలాగే ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. స్టేడియం, పార్కుల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీసం తాగునీరు కూడా లేకుండా చేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఎక్కడ పార్కులు, స్టేడియంలలో అదనంగా చేసింది ఏమీ లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే కచ్చితంగా నగరంలో ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచే విధంగా పార్కులు, స్టేడియంలను అభివృద్ధి చేస్తామన్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రజా సేవ చేయడమే లక్ష్యమని, అందుకే ఎంపీ గా పోటీ చేశానని కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఉదయం 6 గంటల నుంచే ప్రచారం చేపట్టారు. తొలుత 14వ డివిజన్ లోని గొల్లగూడెం ఈద్గా మైదానంలో వాకర్లతో కలిసి నడిచారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటించారు. స్థానికంగా కమతం రామకృష్ణ నివాసానికి వెళ్లి..తేనీరు స్వీకరించారు. .
Discussion about this post