ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో విలేజ్ డెవెలప్మెంట్ కమిటీల ఆగడాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పోలీసులు గట్టిగా హెచ్చరిస్తూ..కౌన్సెలింగ్ చేస్తున్నప్పటికీ పరిస్థితి మారటం లేదు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కుల బహిష్కరణ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కుల బహిష్కరణ ఉదంతం వెలుగు చూసింది.
కుల పెద్దలు ఆరు సంవత్సరాలుగా తన కుటుంబంపై కుల బహిష్కరణ విధించారని
కామారెడ్డి జిల్లా బీర్కూర్ కు చెందిన బుడిమి సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల మాట వినలేదని ఇలా చేశారని చెప్పారు. దీనివల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మరెవరికీ ఇలా జరగకూడదనే పోరాటం చేస్తున్నానని వివరించారు.
సాయిలుపై తాము కుల బహిష్కరణ విధించలేదని కుల సంఘ పెద్దలు స్పష్టం చేశారు. కుటుంబ సమస్యలతో తమ వద్దకు వస్తే రాజీ కుదర్చడానికి ప్రయత్నించామని వివరించారు. సాయిలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
నిజామాబాద్ డివిజన్ లోని కొన్ని గ్రామాల్లో విలేజ్ డెవెలప్మెంట్ కమిటీలు కుల బహిష్కరణలు విధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఏసీపీ ఎల్.రాజా వెంకట రెడ్డి చెప్పారు. ఇలా చేయటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Discussion about this post