గ్రేటర్ హైదరాబాద్ లో వివిధ కేటగిరీల విద్యుత్ వినియోగదారులు 79.48 మిలియన్ యూనిట్ల కరెంటును ఒక్కరోజులో ఉపయోగించుకొని రికార్డు నెలకొల్పారు. గతేడాది మే 19న 79.33మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగం జరగ్గా, ప్రస్తుతం ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు సరాసరి వినియోగం 67.97ఎంయూలు అవుతోంది. ఇంతకు ముందు నెలల్లో వినియోగం 57.84 ఎంయూలుగా ఉంది. ఈ ఏడాది విద్యుత్ వినియోగం సగటున 22.7 శాతం పెరిగిందని తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రబ్యూషన్ కంపెనీ అధికారులు చెబుతున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సప్లై జరపడంతో కూడా అధిక వినియోగానికి కారణమవుతుందని సదరన్ పవర్ డిస్ట్రబ్యూషన్ కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ ఫరూఖ్ తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో రోజువారీ విద్యుత్ వినియోగం 90 ఎం యూ కి పెరుగుతుందన్నారు. వినియోగం ఎంత పెరిగినప్పటికీ అదనపు డిస్ట్రుబ్యూషన్ లైన్లు, ట్రాన్స్ ఫారాల ఏర్పాటుతో సిద్దంగా ఉన్నామన్నారు. రోజువారీ వినియోగం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై ప్రతి రోజు అన్ని జోన్ల చీఫ్ జనరల్ మేనేజర్, సూపరెంటెండెంట్ ఇంజనీర్లు, సిబ్బందితో సీఎండీ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని డిస్కం అధికారులు తెలిపారు.
Discussion about this post