రోజు రోజుకు వ్యవసాయానికి చాలా మంది దూరమవుతున్నారు. ముఖ్యంగా వరి నాట్లు కొత్తగా నేర్చుకునేవారు తగ్గిపోతున్నారు. వయసు మీద పడిన పాతవారు పనికి దూరం అవుతుండగా… వారి స్థానంలో కొత్తగా పని నేర్చుకుంటున్న తెలుగు ప్రజల సంఖ్య బాగా తగ్గుతుంది. ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కూలీలు వరినాట్ల కోసం తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారు. ఉత్తరాదికి చెందిన కూలీలతో నాట్లు కొనసాగుతున్న కామారెడ్డి జిల్లా పొలం పనులపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం…
వ్యవసాయంలో వానాకాలం సీజన్ మొదలై నెల గడుస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది వరినాట్లు మొదలయ్యాయి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువడం లేదు. కానీ నిజాం సాగర్ కాలువ నుంచి సాగునీటిని విడుదల చేయడంతో బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా వరినాట్లు మొదలయ్యాయి. రోజు రోజుకు వ్యవసాయంలో స్థానికంగా కూలీల కొరత ఏర్పడుతూ వస్తుంది. పనికి దూరమౌతున్న పాతవారి స్థానంలో కొత్తగా ఎవరూ వరినాటు పనులు నేర్చుకోవడం లేదు. అదే సమయంలో చాలా మంది రైతులు ఇతర పంటల కంటే వరి పంట వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఏర్పడిన కూలీల కొరతను అధిగమించేందుకు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నాట్లు వేసేందుకు గత కొన్నేళ్లుగా వస్తున్నారు.
అదే క్రమంలో ఈ ఏడాది కూడా కూలీల కొరత కారణంగా బీహార్ రాష్ట్రం నుంచి కొంత మంది కూలీలు కామారెడ్డి జిల్లాకు వచ్చారు. మరికొంద మంది కలకత్తా నుంచి నాట్లు వేసేందుకు ఇక్కడికి వచ్చారు. మనకు ఇక్కడ పనులుండీ చేసే వారు లేక ఇబ్బంది పడుతుండగా, అందుకు భిన్నంగా అక్కడ చేసేందుకు పనిలేక చాలా మంది ఎదురు చూస్తున్నారు. చాలా మంది బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనుల కోసం స్థిరపడ్డవారు చాలా మంది ఉన్నారు. అయితే బతుకు దెరువు కోసం ఇక్కడికి వచ్చిన ఉత్తరాది కూలీలు వరినాట్లు చక్కగా వేయడం స్థానికులను ఆకట్టుకుంటుంది. దీంతో క్రమంగా చాలా మంది రైతులు ఉత్తరాది కూలీలతోనే వరినాట్లు వేయిస్తున్నారు.
స్థానికులు నాటేసేందుకు వస్తే… వరి నాటు రోజు రైతుకు ఉండే పని ఒత్తిడి అధికమనే చెప్పాలి. నారు మడి నుంచి నీరు పీకేందుకు కూలీలను ఏర్పాటు చేయాలి. దాన్ని ప్రధాన పొలంలో చేర్చడానికి మరో కూలీని నియమించాలి. కూలీలు నాట్లు వేసిన కొద్ది వరి నారు ఎక్కువ తక్కువ అవుతుంటే… ముందుకు, వెనక్కు జరిపేందుకు ఒక మనిషి అదనంగా ఉండాలి. కానీ ఉత్తరాది కూలీల విషయంలో అలా ఉండదు. ఎకరం పొలం నాటేసేందుకు గంపగుత్తగా మాట్లాడుకుంటారు. పొలం ఎంత విస్తీర్ణం ఉంటే… ఆ లెక్కన డబ్బులు లెక్కకట్టి తీసుకుంటారు. నారుమడితో నారు పీకడం నుంచి దాని ప్రధాన పొలానికి మార్చడం వారే చూసుకుంటారు. పైగా నాటు వేసే సమయంలో కూలీల వెంట అదనంగా ఒక్కరు కూడా ఉండాల్సిన అవసరం లేదు.
ఒక్కమాటలో చెప్పాలంటే… సుమారు ఐదారు ఎకరాల పొలం ఉన్న రైతులు స్థానిక కూలీలతో వరినాట్లు వేయాలంటే… కూలీలు దొరక్క రోజుల తరబడి వేచిచూడాలి. అదే ఉత్తరాది కూలీలైతే ఉదయం పనిలోకి వస్తే… సాయంత్రానికి పూర్తి చేసి వెళుతారు. అంటే ఒక్కరోజులోనే పని పూర్తవుతుందన్న మాట. పైగా వారు వేసే వరినాట్లు మెషిన్ నాటు మాదిరిగా చక్కగా ఉంటాయి. వరుస క్రమంలో కనిపిస్తారు. ఏక రీతిన వరినాట్లు ఉండటంతో నారు ఎంత పడుతుందనేది వారికి ముందే అర్థం అవుతుంది.
ఉత్తరాది నుంచి ఉపాధి కోసం వచ్చిన కూలీలను పలకరించింది ఫోర్ సైడ్స్ టీవీ. తమ ప్రాంతంలో కనీస ఉపాధి లభించడం లేదని కూలీలు ఫోర్ సైడ్స్ టీవీతో చెప్పారు. రెండు నెలల పాటు ఇక్కడ పని చేయడం ద్వారా వచ్చే డబ్బులతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో తమకు పని లభించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఒక గుత్తేదారు సాయంతో వరినాట్లు వేసేందుకు సిద్దమవుతారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరికి చాలా ప్రాముఖ్యత ఉంది. జిల్లాలో జూన్ లో వరినాట్లు మొదలై ఆగస్టు చివరి వరకు కొనసాగుతుంటాయి. ఈ సీజన్లో వర్షాలు ఇంకా ప్రారంభం కాకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు.
Discussion about this post