ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకేసులో ఏం జరగనుందనే ఉత్కంఠ రేగుతోంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండడంతో ఏం జరగబోతుందోననే ఉత్కంఠ సర్వత్ర కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసుతో పాటు ఓటుకు నోటు కేసు కూడా విచారణకు వస్తున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన కనిపిస్తుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో ఊరట లభించకపోవడంతో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు అక్టోబర్ 3కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబు పిటిషన్ కు ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది.చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా, ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే.. స్కిల్ కేసులో FIRలో ఉన్న అంశాలపై వాదించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమన్నారు. ఆరోపణలు ఎప్పటివనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశంమని హరీశ్ సాల్వే చెప్పారు. 2018 జులైకి ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ వర్తించదన్న వాదనల్లో అర్ధం లేదన్నారు హరీష్ సాల్వే. సెక్షన్ 17ఏ ఎంక్వైరీ తేదీ గురించే చెబుతుంది తప్ప.. నేరం జరిగిన తేదీ గురించి కాదన్నారు.
ఇక సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయిందన్నారు. అప్పుడే దీన్ని CBI పరిశీలించిందని.. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారని రోహత్గీ ప్రశ్నించారు. తప్పు చేసింది 2015-16లో.. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందే అని కోర్టుకు వివరించారు. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారని ముకుల్ రోహత్గీ వాదించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారని.. కేవలం 10శాతం ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90శాతం మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారు.. ఆ వెంటనే 10శాతం నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయని కోర్టుకు వివరించారు ముకుల్ రోహత్గీ. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అక్టోబర్ 4వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. మరోవైపు ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 4న సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసు లిస్టు అయింది. ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు క్వాష్ పిటీషన్ ఈ నెల 3న సుప్రీంలో విచారణకు రానుంది. ఆ మరుసటి రోజునే ఓటుకు నోటు కేసు లిస్టు అవ్వడంతో వరుసగా రెండు రోజులు సుప్రీంలో కేసుల వ్యవహారంపైన ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
Discussion about this post