కొండాయి గ్రామం… ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని ఈ గ్రామాన్ని సరిగ్గా ఏడాది క్రితం పెను ప్రమాదం కాటేసింది. భారీ వర్షం కారణంగా వాగు ఉప్పొంగి ఊరు ఊరంతా నీటిలో మునిగిపోయింది. ఎనిమిది మంది గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. సర్వం కోల్పోయిన కొండాయి గ్రామస్థులు ఆ షాక్ నుంచి ఇప్పటికీ కోలుకోలేదు. మరోసారి వర్షాకాలం రావడంతో గత ఏడాది జ్ఙాపకాలు వీరిని వెంటాడుతున్నాయి. గత ఏడాది కొండాయి గ్రామంలో ఏం జరిగింది? ఏడాది తర్వాత ఆ గ్రామస్థుల పరిస్థితి ఇప్పుడే విధంగా ఉంది? అసలు వారేమనుకుంటున్నారు? ఫోర్ సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్టు ద్వారా తెలుసుకుందాం…
మనమిప్పుడు చూస్తున్నదే ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని కొండాయి గ్రామం. గత ఏడాది జులై 27వ తేదీన మద్యాహ్నం పూట ఒక్కసారిగా భారీ వర్షం కురిసి వరదనీరు గ్రామాన్ని చుట్టుముట్టింది. గ్రామాన్ని చుట్టుముట్టిన వరదల్లో ఎనిమిది మంది గ్రామస్థులు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బ్రిడ్జి కూడా వరద తాకిడికి కూలిపోయింది. ఇంట్లో వస్తువులన్నీ తడిచి ముద్దయ్యాయి… వరదలో కొట్టుకుపోయాయి… ఇక ఆ గ్రామస్థుల ఉపాధి అయిన పొలాలన్నీ ఇసుక మేట వేశాయి. ఎటూ పాలుపోని దుర్భర స్థితిలోకి కొండాయి గ్రామస్థులు నెట్టేయ బడ్డారు. ఈ విషాద ఘటన జరిగి సరిగ్గా ఏడాదవుతోంది. ఇప్పుడా గ్రామస్థులను కదిలిస్తే వారి కళ్లల్లో కన్నీళ్లే తిరుగుతున్నాయి.
ఇంతటి భయానక పరిస్థితి ఎదుర్కొన్న కొండాయి గ్రామస్థులకు ఇప్పటికీ సరైన భరోసా లభించడం లేదు. మళ్లీ వర్షాకాలం వచ్చింది. కూలిపోయిన బ్రిడ్జి పనులు ముందుకు సాగక… గ్రామస్థులకు అందుబాటులోకి రావడం లేదు. కనీసం కాలి నడక బ్రిడ్జి నిర్మిస్తామని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఎందుకూ కొరగానివిగా మారాయి. వాగును దాటేందుకు ఏర్పాటు అధికారుల చేసిన తాత్కాలిక ప్రయత్నాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగ పడటం లేదు. సుమారు 30లక్షల రూపాయల వ్యయంతో కాలి నడక బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే ఆ నిర్మాణం ఎవరికీ ఉపయోగ పడని బ్రిడ్జిగా తయారయింది. ఫలితంగా మోకాలు లోతు నీళ్లలోనే గ్రామస్థులు వాగు దాటుతున్నారు.
ఈ ఏడాది ఇప్పటికీ ఒక్క భారీ వర్షం కూడా కురిసిన పరిస్థితి లేదు… కానీ వాగులో నీటి ప్రవాహం చూస్తే భయమేస్తోంది. అసలు వర్షాకాలమంతా ఇంకా ముందే ఉంది.
ఏ కొద్దిపాటి వర్షం కురిసినా వాగులో నీటి ప్రవాహం పెరగడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో గ్రామస్థులకు బయటి ప్రపంచంతో సంబందాలు తెగిపోయావాల్సిందే. ఇక వాగు ఉదృతంగా ప్రవహించే సమయంలో గ్రామస్థులు అత్యవసర వైద్య సేవల కోసం బయటికి వెళ్లాలంటే… కుదరని పరిస్థితి నెలకొంటోంది. అయితే అక్కడ జరుగుతోన్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలిస్తే మరో ఏడాది వరకు కూడా పనులు పూర్తయ్యేట్లు కనిపించడం లేదు. ఇక కాలి నడక బ్రిడ్జి కోసం వెచ్చిస్తున్న 30లక్షల రూపాయల నిధులు వాగులో పోసిన చందంగానే మారాయి. గ్రామస్థులకు బయటి ప్రపంచంతో కనెక్టివిటీ పెంచే దిశగా ఆలోచన చేస్తే చక్కటి పరిష్కారమే ఉన్నప్పటికీ… ఎందుకనే ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ఇప్పుడీ బైక్ పరిస్థితి చూడండి. ఊర్లో నుంచి బయటికి వళ్లాలంటే బురద రోడ్డుతో బైకులు ఇంతటి దుర్బర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఈ మార్గంలో కొద్దిపాటి వర్షానికే బురదగా మారి వాహనాలు రాలేని పరిస్థితి కలుగుతోంది. 30లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన కాలి నడక బ్రిడ్జి ఎందుకూ పనికి రాకుండా పోతోంది. అదే మొత్తంలో నుంచి ఒకటి, రెండు లక్షల రూపాయలు వచ్చించి… మట్టి రోడ్డును మొరంతో గట్టిగా ఉండేలా ఏర్పాట్లు చేస్తే ఇటువైపు నుంచి కాకుండా ఊరికి వేరేవైపు నుంచి బయటి ప్రపంచంతో రాకపోకలు సాగే అవకాశం ఉంది. కానీ ఆ మార్గాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. గత ఏడాది వర్షానికి సర్వస్వం కోల్పోవడమే కాకుండా… పొలాల నిండ వాగులోని ఇసుక వచ్చి మేటలు వేయడంతో పంటలు కూడా సాగు చేసుకోలేని అద్వాన్న పరిస్థితిలోకి నెట్టేయబడ్డారు కొండాయి గ్రామస్థులు.
పొలం పనులు మొదలయ్యే కాలం కావడంతో రైతులకు మందు బస్తాలు అవసరం అవుతాయి. 50 కిలోల బరువుండే ఒక్కో బస్తాను వాగు దాటీయాలంటే సాధ్యం కాని పరిస్థితి. ఏ వస్తువులు లేకుండా మనుషులు ఖాళీ చేతులతో దాటాలంటేనే మోకాలు లోతు నీళ్లులో నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఇక 50కిలోల మందు బస్తాలు తీసుకొని వాగు దాటాలంటే ఎట్లా అనేది అధికారులు ఆలోచించాలి. బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న వైపు నుంచి మందు బస్తాలు గ్రామానికి తీసుకు రావడం సాధ్యం కాదు. కాబట్టి గ్రామానికి మరోవైపు నుంచి ఉన్న దారిని బాగు చేస్తే గ్రామస్థులకు సరుకులు, మందుబస్తాలు తెచ్చుకునేందుకు… అదే విధంగా అత్యవసర సమయంలో బయటి గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది.
కొండాయి గ్రామస్థులు కోల్పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేము. వారి నష్టాన్ని పూడ్చలేము. కానీ బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు ఉండేలా… రాకపోకలు సాగించేలా… ప్రభుత్వం మేమున్నామంటూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జి ఈ వర్షాకాలం తర్వాత చేపట్టి పూర్తి చేయొచ్చు. కానీ తక్షణ పరిష్కారంగా వీరి జీవనంతో ముడిపడి ఉన్న పనులు సాగేందుకు ఊరికి మరోవైపు నుంచి దారికి బాగు చేయాలని ఫోర్ సైడ్స్ టీవీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.
Discussion about this post