డిజిటల్ యుగంలో… పనేదైనా సరే వేగంగా జరగాల్సిందే. కూర్చున్న చోటే ప్రపంచాన్ని చుట్టివచ్చే సదుపాయం కల్పిస్తోంది ఇంటర్ నెట్. ఒక్కసారి దీనికి అలవాటుపడ్డ తర్వాత కాస్త అంతరాయం కలిగినా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడలాంటి పరిస్థితినే పాకిస్థాన్ లోని ఇంటర్ నెట్ వినియోగదారులు ఎదుర్కొంటున్నారు.
మనం కంప్యూటర్ పైన గానీ… ల్యాప్ ట్యాప్ పైన గానీ… చివరకు అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ పైన గానీ… నెట్ వాడుతున్నప్పుడు మనకు కావాల్సిన పని సులభంగా అవుతుంది. అయితే అప్పుడప్పుడు నెట్ సమస్య వచ్చి పనులు ఆలస్యం అవుతాయి. మనకు కావాల్సిన పని వాయిదా వేసుకోవాల్సిందో… లేక నెమ్మదిగా చేసుకోవాల్సిందో అయితే ఫర్వాలేదు. కానీ అత్యవసర పరిస్థితి అయితే ఆ చికాగే వేరు. అలాంటప్పుడు నెట్ నత్తతో పోటీ పడుతుందని చెబుతాం. ప్రస్తుతం
పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ వేగం కూడా నత్తతోనే పోటీ పడుతోందట. ఫలితంగా అక్కడి లక్షలాది మంది ఇంటర్ నెట్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
పాకిస్థాన్ లో ప్రస్తుతం వినియోగదారులకు వాట్సాప్ సందేశాలు, ఈ-మెయిల్స్ మొదలుకొని ఆన్లైన్ లావాదేవీల వరకు ఏ ఒక్కటీ కూడా సకాలంలో పూర్తి కాని దుస్థితి. అందుకు కారణం… ఇంటర్నెట్ వేగం మందగించడమే. లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులపై దీని ప్రభావం పడటంతో పాటు వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. కొన్నిరోజులుగా ఈ సమస్య తీవ్రమైందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇంటర్ నెట్ వేగం దాని సాధారణ సామర్థ్యంలో సగానికి పడిపోయిందని నిపుణులు అంచనా వేశారు. దీని వెనుక ప్రభుత్వ పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కనీసం ఈ-మెయిల్స్, వాట్సాప్ సందేశాలు పంపలేని దుస్థితి నెలకొందని నెటిజన్లు వాపోతున్నట్లు సమాచారం. ఆస్పత్రులు, వ్యాపార కార్యకలాపాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బలహీనంగా మారిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు… ఈ పరిణామాలతో 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఐటీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘పాకిస్థాన్ సాఫ్ట్వేర్ హౌస్ అసోసియేషన్’ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వమే ‘జాతీయ ఫైర్ వాల్’ను ఏర్పాటు చేస్తోందని, ఇది కాస్త ఇంటర్నెట్ మందగమనానికి దారి తీస్తోందని ఆరోపించింది.
గత వారంతో పోలిస్తే ఇంటర్నెట్ వేగం ఇప్పుడు 40 శాతం తక్కువగా ఉందని… ఒక్కోసారి ఇది 80 శాతానికి కూడా చేరుకుంటోందని ఇస్లామాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే దీని వెనుక ప్రభుత్వ పాత్ర ఉందన్న వాదనను పాకిస్థాన్ ఐటీ శాఖా మంత్రి ఖండించారు. ‘వీపీఎన్’ వాడకం వల్ల కొన్ని సందర్భాల్లో ఫోన్లలో ఈ సమస్య తలెత్తుతోందన్న మంత్రి సమస్యకు మూల కారణాన్ని కనుగొనేందుకు అధికారులు పనిచేస్తున్నారని… సైబర్ సెక్యూరిటీని మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
పాకిస్థాన్‌లో 11 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇది ఆ దేశ జనాభాలో దాదాపు సగం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు… షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సోషల్ నెట్‌వర్క్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపింది. అప్పటి నుంచి వాటి వినియోగం విషయంలో నెటిజన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ వేగం కూడా పడిపోయింది. ఇంటర్ నెట్ వేగం పడిపోవడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలిగించే అంశమే.
Discussion about this post