నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్సంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలాయి శ్రీనివాస్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న పాలాయి శ్రీనివాస్ కే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అవకాశం దక్కింది. సుమారు 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న లేకున్నా ఎమ్మెల్యే మాధవరెడ్డికి వీర విధేయులుగా ఉంటూ నియోజకవర్గం లో పార్టీ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలోని ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆయన సేవలను గుర్తించి 2005 సంవత్సరంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించగా 2005 నుండి 2011 వరకు సమర్థవంతంగా విధులు నిర్వహించారు. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం దొంతి మాధవ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసం నిత్యం కష్టపడిన ఆయన కార్యకర్త నుండి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో మార్కెట్ చైర్మన్ గా పూర్తిస్థాయి సేవలు అందించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరోసారి శ్రీనివాస్ కు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పట్టం కట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా శాఖమూరి హరిబాబు లను నియమించగా కమిటీ డైరెక్టర్లుగా బొల్లు రమేష్, కొల్లూరి మధుకర్, చీర అశోక్, కోరే కుమారస్వామి, హింగే రామారావు, చెల్పూరి జ్యోతి, అజ్మీర ధంజ్యానాయక్, డక్క శ్రీనివాస్, సలాఉద్దీన్ అయుబ్ ఖాన్,గట్టి సారంగపాణి, స్వామిశెట్టి ప్రభాకర్ లను నియమిస్తూ వ్యాపాల వర్గాల నుండి బండారి దామోదర్, దుగ్గొండి పిఎసిఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఏడిఏ, నర్సంపేట మున్సిపల్ చైర్మన్ లకు కార్యవర్గంలో చోటు కల్పించారు.
Discussion about this post