ప్రపంచ క్రీడల సంరంభం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి క్రీడాభిమానులను మురిపించారు. ఈ ఒలింపిక్స్ లో ఓవరాల్‌గా చూసుకుంటే అమెరికా (USA) అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఈసారి రెండంకెల పతకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా పారిస్ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్‌కు నిరాశజనక ఫలితాలు ఎదురయ్యాయి. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాలను మించి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత బృందం బయలుదేరింది. కానీ కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకుని ఆశలు పెట్టుకున్న అథ్లెట్లు నిరాశపరిచారు. దానికి తోడు అదృష్టం కూడా కలిసి రాకపోవండతో అరడజనుకు పైగా పతకాలు తృటిలో చేజారాయి.
నిరాశపరిచిన స్టార్లు..
పతకాలు అనుకున్నన్ని సాధించలేకపోయినా.. ప్రదర్శన మాత్రం గతం కంటే మిన్నగా ఉందని చెప్పొచ్చు. ఏడు ఈవెంట్లలో భారత అథ్లెట్లు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాలు సాధించే అవకాశాలను కోల్పోయారు. గత ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గెహెయిన్ వంటి వారు ఈసారి పతక వేటలో వెనుకబడ్డారు. ఈసారి కచ్చితంగా పతకాలు సాధిస్తారని అనుకున్న లక్ష్యసేన్, బాక్సర్ నిఖత్ జరీన్‌లు కూడా నిరాశపరిచారు.
సత్తా చాటిన షూటర్లు..
ఈసారి భారత్ సాధించిన తొలి మూడు పతకాలు షూటింగ్లో వచ్చినవే. అందులో రెండు కాంస్యాలను 22 ఏళ్ల మను భాకర్ కొల్లగొట్టింది. ఓ దశలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచేలా కన్పించిన మను భాకర్.. చివరకు కాంస్యంతో సరిపెట్టుకుంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి.. తృటిలో పతకాన్ని కోల్పోయింది. ఆర్చరీలో ధీరజ్-అంకిత, షూటింగ్లో అనంత్ జీత్- మహేశ్వరీ, బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్, లవ్లీనా బోర్గెహెయిన్, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్‌లు స్వల్ప తేడాలో పతకాన్ని మిస్ చేసుకున్నారు.
నీరజ్ రజతం.. ఫోగట్ తీర్పు వాయిదా:
పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ అసాధారణ త్రో కారణంగా నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెజ్లర్ వినేష్ ఫొగాట్ సైతం ఫైనల్ చేరి పతకం ఖాయం చేసింది. కానీ నిర్ణీత బరువు కంటే 100 గ్రాముల అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఫోగట్ ఆశ్రయించింది. ఈ కోర్టు తీర్పు ఈనెల 13న వెలువడనుంది. ఒకవేళ ఆమెకు అనుకూలంగా తీర్పు వస్తే భారత్ ఖాతాలో మరో రజత పతకం చేరనుంది. అదే జరిగితే టోక్యో 2020 ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాల సంఖ్యను భారత్ అందుకుంటుంది.
Discussion about this post