స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయమై అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని పేర్కొంది. కోర్టులు చట్టాలు చేయవని, వాటిలోని మంచి చెడులను చూస్తాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ఇచ్చింది. అయితే స్వలింగ సంపర్కులు సహజీవనంలో ఉండవచ్చని, వారికి పెళ్లి చేసుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. కానీ పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉండదని స్పష్టం చేసింది. విశేషం ఏమిటంటే.. దత్తత హక్కు విషయంలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, జస్టిస్ కౌల్ మెజారిటీ తీర్పుతో విభేదించారు.
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018 లో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ పలు వర్గాల నుంచి 21 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తాజా తీర్పు వెలువరించింది. వివిధ అంశాలపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ పీ.ఎస్.నరసింహ నాలుగు తీర్పులు వెలువరించారు.
స్వలింగ సంపర్కులకు చట్టబద్ధ వివాహ హక్కు లేదని, రాజ్యాగం ప్రకారం దానిని మౌలిక హక్కుగా పొందజాలరని కోర్టు పేర్కొంది. అయితే వీరి సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవలసిన చర్యలపై పరిశీలన జరిపేందుకు కేంద్ర కాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ఆదేశించింది. అయితే వీటిపై నిర్ణయానికి వచ్చేముందు రాష్ట్ర ప్రభుత్వాలతోను, ఆయా వర్గాల ప్రతినిధులతోను చర్చలు జరపాలని పేర్కొంది.
సుప్రీమ్ కోర్టు తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, జమియత్ ఉలేమా ఏ హింద్, కేరళ కేథలిక్ బిషప్స్ కౌన్సిల్ స్వాగతించాయి. ఈ తీర్పు తనను నిరుత్సాహపరిచిందని కేరళకు చెందిన తొలి ట్రాన్స్ జెండర్ న్యాయవాది పద్మా లక్ష్మి అన్నారు. కోర్టు తీర్పులోని భిన్న అంశాలను అధ్యయనం చేస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చెప్పారు. న్యాయపరంగా, సామాజికంగా, రాజకీయంగా వివక్షకు చోటు లేని విధానాలు ఉండాలనేదే తమ అభిప్రాయమన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత అంశాన్ని పార్లమెంటుకు వదిలేయడం ద్వారా పార్లమెంటరీ ఆధిపత్య సూత్రాన్ని సుప్రీమ్ కోర్టు సమర్ధించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వివాహం స్త్రీ పురుషుల మధ్యే జరగాలన్నది తన విశ్వాసమన్నారు.
Discussion about this post