కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో నినాదంతో పదేళ్ల క్రితం పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. ఆయన హఠావో అన్న పార్టీ… ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కాని ఆయన మాత్రం కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు రెండు సార్లు ఎన్నికలు జరిగితే… గత ఎన్నికల్లో మాత్రమే పవన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే… ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయారు. జగన్, చంద్రబాబు వంటి కీలక నేతలకు సొంత నియోజకవర్గాలు ఉంటే.. పదేళ్లు గడుస్తున్నా సొంత నియోజవకవర్గం లేని నేతగా పవన్ కల్యాణ్ మిగిలిపోయారు.
చంద్రబాబు నియోజకవర్గం కుప్పం, జగన్ నియోజకవర్గం పులివెందుల, కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్. మరి పవన్ కల్యాణ్ నియోజకవర్గం ఏది అంటే.. చెప్పడం కష్టమే. పార్టీ అధ్యక్షుడు అంటే గెలుపోటములతో సంబంధం లేకుండా.. అతడికి రాష్ట్రవ్యాప్తంగా పట్టుండాలి. ఎక్కడికెళ్లినా జనాలు ఆదరించాలి. అప్పుడే అతడు విజయం సాధించినట్టు. నాయకుడు అంటే కేవలం తన సామాజిక వర్గం మాత్రమే కాక కులమతాలకతీతంగా అందరి అభిమానాన్ని సంపాదించుకోవాలి. తాను ఇదే కోవకు చెందుతానని.. తనకు కులాలు, మతాలతో పట్టింపు లేదని.. తాను అందరి వాడిని అని పదే పదే ప్రచారం చేసుకుంటారు పవన్. కుల రాజకీయాలే తనకు నచ్చవని.. గొప్పలకు పోతారు. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాలు, మతాల పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నాడని అనేక సందర్భాల్లో విమర్శించారు. మరి ఇన్ని చెప్పిన పవన్ చివరకు చేసింది ఏంటి అంటే.. కుల రాజకీయం.
కులాల కంపు, మతాల చిచ్చు అంటూ పెద్ద పెద్ద డైలాగ్లు చెప్పే పవన్.. చివరకు తను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం కోసం అదే కులాస్త్రాన్ని వాడుకుంటున్నారు. మొన్నటి వరకు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తాడని ప్రచారం సాగింది. కానీ తాజాగా టీడీపీ-జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పవన్ పోటీ చేయబోయే స్థానం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అసలు పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తాడా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది.
Discussion about this post