తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా అన్న విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పోటీపై నిర్ణయం తీసుకోవడానికి ఒకటి రెండు రోజుల సమయం అవసరమని తమ అధినేత చెప్పినట్టు జనసేన నాయకత్వం వెల్లడించింది.
ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్‌కు రాష్ట్ర నాయకత్వం వివరించింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని, మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా పోటీ చేయలేదని గుర్తు చేసింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపొతే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని వివరించింది.
పార్టీ నేతల అభిప్రాయాలను విన్న పవన్ కల్యాణ్.. ఎన్నికలలో పోటీ విషయమై తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. నాయకులు, జన సైనికుల అభిప్రాయాలకు విలువ ఇస్తానన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటి రెండు రోజుల సమయం అవసరమని చెప్పారు. వాస్తవానికి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Discussion about this post