టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ఎగ్జిబిటర్ల సమస్యలు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు.

చిత్ర పరిశ్రమలో అందరికీ పెద్ద దిక్కుగా ఉంటూ, ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి నడిపించే చిరంజీవి వద్దకు ఇప్పుడు ఎగ్జిబిటర్ల పంచాయితీ చేరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, సినిమాల విడుదల విధానంపై చర్చించేందుకు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ రోజు కానీ, రేపు కానీ దీనికి సంబంధించిన అధికారిక సమయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం కుదర్చడంలో చిరంజీవి పాత్ర కీలకం కానుంది.
ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు ప్రధానంగా రెండు అంశాలను చిరంజీవి ముందు ఉంచబోతున్నారు. రాబోయే రోజుల్లో విడుదల కానున్న పెద్ద సినిమాలను ‘పర్సంటేజ్’ ప్రాతిపదికన మాత్రమే థియేటర్లలో ప్రదర్శించేలా నిర్ణయం తీసుకోవాలని ఎగ్జిబిటర్లు కోరనున్నారు. దీనివల్ల నిర్మాతలతో పాటు థియేటర్ల యాజమాన్యాలకు కూడా లబ్ధి చేకూరుతుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఫిక్స్‌డ్ రెంటల్’ విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా నష్టపోతున్నాయని అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్‌కు వివరించనున్నారు. సినిమా ఆడినా ఆడకపోయినా భారీ మొత్తంలో అద్దెలు చెల్లించాల్సి రావడం వల్ల ఎగ్జిబిటర్లు అప్పులపాలవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. మల్టీప్లెక్స్‌ల హవా పెరిగిపోవడం, మరోవైపు ఓటీటీల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి రోజురోజుకూ అత్యంత దయనీయంగా మారుతోంది.
కరెంట్ బిల్లులు, థియేటర్ మెయింటెనెన్స్, సిబ్బంది జీతాలు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పెద్ద సినిమాల విడుదల సమయంలో అనుసరిస్తున్న కొన్ని విధానాలు తమను మరింత కుంగదీస్తున్నాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరి క్షేమాన్ని కోరే మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యపై సానుకూలంగా స్పందిస్తారని, నిర్మాతల మండలితో మాట్లాడి ఎగ్జిబిటర్లకు న్యాయం జరిగేలా చూస్తారని అసోసియేషన్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
సాయంత్రం జరగబోయే ఈ హై-ప్రొఫైల్ సమావేశం అనంతరం టాలీవుడ్ ఎగ్జిబిషన్ సెక్టార్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న బాలకృష్ణ.. ఎఫ్‌డీసీని పూర్తిగా యాక్టీవ్ చేసి, సినిమా, నాటక, టీవీ రంగానికి పెద్ద పీట వేసేలా కమిటీ వేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో ‘థియేటర్లలో సినిమాలు లేక.. ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలి కలుగుతుందని అన్నారు.
Follow for more updates.
