తెరుచుకున్న పెట్రోల్ బంకులు ? గందరగోళానికి కారణం ఏమిటి ?
ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించడంతో హైదరాబాద్ నగరంలో,తెలంగాణ జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఇవాళ తెరుచుకున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద మందకొడిగా.. మరికొన్ని పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ ఉంది. కొన్ని చోట్ల ఇంధనం దొరుకుతుందా? లేదా అన్న అనుమానంతో వాహనదారులు బాటిల్స్‌తో బారులు తీరారు. ఈ అంశం పై 4 సైడ్స్ టీవీ ప్రతి నిధి సోహెల్ మరింత సమాచారం అందిస్తారు.
కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తున్నారన్న వార్తలతో.. మంగళవారం ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని నగరం మధ్యాహ్నానికి ట్రాఫిక్‌జామ్‌తో స్తంభించిపోయింది! వేలాది మంది తమ వాహనాలతో పెట్రోల్ బంకుల వద్దకు క్యూకట్టి.. ట్యాంకులు ఫుల్ చేయించుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆ క్యూలు బంకుల బయట కిలోమీటరు దూరానికిపైగా వ్యాపించి జంక్షన్లు జామైపోయాయి! సాధారణంగా అరగంట పట్టే దూరానికి రెండు గంటలకు పైగా సమయం పట్టడంతో ప్రజలు,వాహనదారులు ఇబ్బంది పాలైనారు. ఈ సమ్మె ఏమిటి? ఎన్నిరోజులు? అనే విషయాలే తెలియక పోవడం తో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్‌మీడియాలో ఇష్టారీతిన ప్రచారం జరిగింది.
ఈ ఉపద్రవానికి అసలు కారణం ఏమిటంటే….. హిట్ అండ్ రన్ కేసుల్లో.. రూ.7 లక్షల జరిమానా, పదేళ్ల దాకా జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్తచట్టాన్ని తీసుకురావడమే.. ఈ చట్టం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ట్రక్కుడ్రైవర్లు సోమవారం సమ్మెకు దిగారు. మంగళవారం ఆ సమ్మె రెండోరోజుకు చేరింది. . సోషల్ మీడియాలో చాలా మంది ఈ విషయాన్ని విస్తృతంగా వైరల్ చేయడంతో అందరిలో ఆందోళన పెరిగింది.ఈక్రమంలోనే చాలా మంది పెట్రోల్ బంక్‌ల వద్దకు వాహనాలతో, పెట్రోల్ క్యాన్లు, బాటిళ్లతో చేరుకున్నారు. అవకాశం దొరికినవారంతా ట్యాంకులు ఫుల్ చేయించుకున్నారు. మొత్తం మీద తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్టు ట్రక్కు డ్రైవర్లు, యజమానులు మంగళవారం రాత్రి ప్రకటించడం, బంకులకు పెట్రోల్ యథావిధిగా సరఫరా అవుతుందన్న సమాచారం వాహనదారులకు ఊరట కలిగించింది.
Discussion about this post