ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ప్రాంతాలు ఆలయాలతో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. మరికొన్ని రాజుల పాలనకు సాక్ష్యంగా నిలుస్తాయి. కానీ తెలంగాణలో పాలమూరు జిల్లా పేరు చెబితే చాలా మందికి గుర్తొకొచ్చేది రాజుల పాలన… రాచరిక కోటలు… ఆలయాల కంటే కూడా ఒక చెట్టు పేరు చెబుతారు. చెట్టంటే… అదేదో చిన్నపాటి చెట్టు కాదు… మహా వృక్షం… ఆ మాటకొస్తే వటవృక్షం… ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే పిల్లల మర్రికి 7వందల ఏళ్ల చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్రతో మహబూబ్ నగర్ జిల్లాకే తల మానికంగా నిలుస్తోన్న పిల్లల మర్రిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం…
పాలమూరు అంటేనే కష్టజీవుల జిల్లా… వలసకూలీల జిల్లా… బతుకుదెరువు కోసం ఈ జిల్లా వాసులు సమీపంలోని హైదరాబాద్ నగరానికి, ముంబాయికి, ఇతర ప్రాంతాలకు వలస వెళుతారు. అక్కడ నెలకొన్న కరువు పరిస్థితులు వారిని వలస బాట పట్టేలా చేశాయి. అయితే ప్రకృతితో మమేకమయ్యే పాలమూరు వాసులకు గుర్తింపుగా నిలుస్తోంది ఆ జిల్లాలోని పిల్లల మర్రి. ఇదిగో మీరిప్పుడు చూస్తున్న మర్రి చెట్టే అందరూ ముద్దుగా పిలిచే పిల్లల మర్రి. ఇది అన్ని చెట్ల మాదిరిగా 40ఏళ్లు, 50ఏళ్ల వయస్సు కలిగింది కాదు. ఈ పిల్లల మర్రికి ఏడు వందల ఏళ్ల చరిత్ర ఉంది. అందుకే చాలా మందికి పాలమూరు పేరు చెప్పగానే పిల్లల మర్రి గుర్తుకొస్తోంది.
చెట్లలో మర్రి చెట్టు ప్రత్యేకత వేరు. ఏదైనా ఒక పనిని దృఢంగా, పట్టుదలతో చేస్తామని చెప్పేందుకు చాలా మంది మర్రి చెట్టును ఉదహరిస్తారు. ఎందుకంటే… మర్రి చెట్టు ఊడలు పోస్తూ కాలానుగుణంగా వృద్ది చెందుతూనే ఉంటుంది. సినిమాల్లోనూ మర్రి చెట్టులాగా బలమైన ఊడలు పోస్తాననే అర్థాన్నిచ్చే డైలాగులు వాడారు. సాదారణంగా ఒకప్పటి పాత రహదారుల వెంట మనకు రోడ్డుకు ఇరువైపుల నీడనిచ్చే చెట్లను పరిశీలిస్తే మర్రి చెట్లే అధికంగా కనిపిస్తాయి. మర్రి చెట్లు… ఇతర చెట్ల మాదిరిగా కాకుండా భూమిలో ఊడలు పోస్తూ తమను తాము బలంగా తయారు చేసుకుంటాయి. అలాంటి ప్రత్యేకత కలిగిన చెట్లు మనకు చాలా ప్రదేశాల్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడి పురాతన మర్రి చెట్టు 700 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. ఇంతటి చరిత్ర కలిగిన మర్రి చెట్టు కొంత కాలం క్రితం ప్రమాదంలో పడింది. కానీ ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడింది.
మర్రి చెట్టు అంటేనే భూమిలో బలంగా ఊడలు దిగి ఉంటాయి. ఈ పిల్లల మర్రి చెట్టు చూడండి. ఇది ఎంతటి సుదీర్ఘ చరిత్ర కలిగింది కాబట్టే చెట్టు అనేక చోట్ల సార్లు భూమిలోకి ఊడలు దిగి… తిరిగి భూమిపైన చెట్టుగా అవతారమెత్తింది. 700 ఏళ్ల క్రితం మొలకెత్తిన ఓ మర్రి మొలక శాఖలుగా విస్తరించి మొదలెక్కడో… అంతుచిక్కని మహారుక్షంగా ఎదిగింది. జిల్లా కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పిల్లల మర్రి ఉంది. ఏ చెట్టు అయినా దాని చుట్టు కొలత ఆదారంగా ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుస్తోంది. కానీ పిల్లల మర్రి విస్తీర్ణం తెలిస్తే అబ్బో అనాల్సిందే… ఎందుకంటే ఇది ఏకంగా నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది మరి. అందుకే చాలా ప్రదేశాల్లో పుణ్య క్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలను, చారిత్రక ప్రదేశాలను చూసేందుకు వెళ్లే సందర్శకులు నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ పిల్లల మర్రిని చూసేందుకు తండోపతండాలుగా వస్తుంటారు. ఆ విధంగా వచ్చిన సందర్శకులు చెట్టుపైకి ఎక్కడం, ఊడలు తొలగించడం పనులు చేయడం కారణంగా దాని ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
సుమారు ఏడేళ్ల క్రితం 2017 డిసెంబరు 16వ తేదీన ఈ మహా వటవృక్షానికి చెందిన భారీ కొమ్మ ఒకటి విరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత క్రమంగా మరికొన్ని కొమ్మలు విరిగిపడే దశకు చేరుకున్నాయి. దీంతో సుమారు 60శాతం మేర చెట్టు ఎండిపోయి నిలువ నీడనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చారిత్రక నేపథ్యం కలిగిన మహావృక్షం కావడంతో ప్రభుత్వం దీని పరిరక్షణపై దృష్టి పెట్టింది. జిల్లా అటవీ శాఖ అధికారులు భారీ కొమ్మ విరిగి పడ్డ నాలుగు రోజుల తర్వాత చెట్టును రక్షించే బాధ్యత తీసుకున్నారు. నాటి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ సూచన మేరకు అటవీ అధికారులు పిల్లలమర్రి పునరుజ్జీవం కోసం చికిత్స చేయాలని నిర్ణయించారు. 2018 ఫిబ్రవరి నుంచి సెలైన్ బాటిల్లతో కొమ్మలు ,ఊడలు విరిగి పోకుండా, కింద పడకుండా వాటికి సహాయంగా పిల్లర్లు నిర్మించారు అధికారులు. అంతే కాదు పిల్లలమర్రికి ప్రాణం పోసే చర్యలకు పూనుకొని… సెలైన్ బాటిళ్లతో చికిత్స చేశారు. చెదలు పట్టిన భాగాన్ని తొలగించి పురుగు తొలవకుండా తరచూ మందులు పిచుకారి చేస్తూ వచ్చారు. దీంతో ఆరేళ్ల కృషి ఫలితంగా ఆ చెట్టు 90 శాతం మేర తిరిగి ప్రాణం పోసుకుంది.
2017 డిసెంబరు తర్వాత మొదటి సారిగా వారం రోజుల నుంచి సందర్శకులను చెట్టు దగ్గరకు అనుమతిస్తున్నారు అధికారులు. దీంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిల్లల మర్రి చెట్టును చూసినట్లే… ఇప్పుడు కూడా చూస్తూ సంతోష పడుతున్నారు. అయితే చెట్టును పరిరక్షించే క్రమంలో అధికారులు చెట్టు విస్తరించి ఉన్న ప్రదేశంలో ఒక పార్కు ఏర్పాటు చేశారు. సందర్శకులు చెట్టుకు ఎలాంటి హాని చేయకుండా అధికారులు ఏర్పాటు చేసిన ట్రాకుల వెంబడి నడుస్తూ పిల్లల మర్రిని చూడాల్సి ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఈ చరిత్రను సాక్ష్యంగా చూపించేందుకు నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానా కూడా విధిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా… ఏడు శతాబ్దాల చరిత్ర కలిగి… నాలుగు ఎకరాల్లో విస్తరించి… వేలాది మంది పర్యాటకుల్ని ఆకర్షించి… పాలమూరుకే పేరు తెచ్చిన పిల్లల మర్రి తిరిగి పునరుజ్జీవం పోసుకోవడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఎప్పటిలాగా చెట్టు పరిసరాల్లో ఆడుకుంటున్నారు. ఇదీ పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రి చరిత్ర.
Discussion about this post