కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగింది. వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ తరుణంలో కేరళ పోలీసులు చేసిన ఓ అభ్యర్థన డార్క్ టూరిజాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు డార్క్ టూరిజం అనే పదం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమిటీ డార్క్ టూరిజం? కేరళ పోలీసులు చేసిన హెచ్చరిక ఏమిటి? ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం…
ఇటీవల వయనాడ్ ప్రాంతంలో జరిగిన ప్రకృతి విలయంతో కేరళ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. పర్యటనల కోసం విపత్తు ప్రాంతాలకు వెళ్లకండి ప్రజలకు సూచించారు. దానివల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని… సహాయం కోసం 112కు కాల్ చేయండంటూ ఒక పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే డార్క్ టూరిజం అనే పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. డార్క్ టూరిజం అనే పదం… చెర్నోబిల్ అండ్ ది డార్క్ టూరిస్ట్ టీవీ షోతో బాగా పాపులర్ అయింది.
ఇక డార్క్ టూరిజం విషయానికొస్తే… మరణం, విషాదం, హింస, అసాధారణ పరిస్థితులు జరిగిన ప్రాంతాలను సందర్శించడాన్ని డార్క్ టూరిజంగా పిలుస్తారు. ఇలాంటి వాటిలో యుద్ధభూమి, జైలు, మార్చురీ, సమాధులు, ఉరితీసిన ప్రాంతాలు, విపత్తు సంభవించిన ప్రదేశాలు ఉంటాయి. అలాంటి ప్రదేశాల చరిత్ర, సంస్కృతి తెలుసుకోవాలని, అక్కడి విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన స్థానిక ప్రజల ఉద్వేగాలతో కనెక్ట్ అయ్యేందుకు డార్క్ టూరిస్టులు వాటిని ఎంచుకుంటారు.
ఉదాహరణకు పోలెండ్‌లోని ఆష్విట్జ్ క్యాంప్, ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ జోన్, కాంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డ్స్, అమెరికాలోని 9/11 మెమోరియల్ వంటివి ఈ టూరిజం డెస్టినేషన్ల కిందకు వస్తాయి. అలాంటి వాటిని సందర్శించి… గతం వల్ల బాధపడిన వారికి ఈ డార్క్ టూరిస్టులు నివాళులు అర్పిస్తుంటారు. ఈ టూరిజం వల్ల చారిత్రక ఘటనలు అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
అయితే సహాయక చర్యలు జరుగుతోన్న సమయంలో డార్క్ టూరిస్టులు వస్తే సహాయక చర్చలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో కేరళ పోలీసులు ముందస్తు హెచ్చరిక చేశారు. దీంతో మరోసారి డార్క్ టూరిజం ప్రచారంలోకి వచ్చింది. డార్క్ టూరిజం అంటే ఇది.
Discussion about this post