ఎండిపోతున్న చెరువులు.. అడుగంటుతున్న బావులు..! ముదురుతున్న ఎండలు.. లోలోతుకు భూగర్భ జలాలు..! పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.! చేతికొచ్చిన పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే..గుండె పగిలేలా విలపిస్తున్న రైతుల కన్నీటి గాథ పై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వ తగ్గిపోతున్నాయి. రోజు రోజుకు ఎండలు పెరుగుతుండటంతో..భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో వరి పొలాలు, కూరగాయలు ఇతర తోటలకు నీరు అందటం లేదు. దీంతో చెతికి వచ్చిన పంట ఎండిపోతుంది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వరి కోతకు వస్తుంది. ఈ దశలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగైతేనే గింజ బలంగా తయారవుతుంది. లేదంటే దిగుబడి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు రైతులు.
లక్షలు ఖర్చు చేసి వ్యవసాయం చేస్తే.. కరువు కారణంగా సాగుకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ఎండిన పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు రైతులు. మహబూబ్ నగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏడాదిలో 643.2 మిల్లి మీటర్ల వర్ష పాతం నమోదు కావాలి. కానీ గత నెల చివరి నాటికి 602.2 మిల్లి మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు అయింది. దీంతో వర్షపాత లోటు ఏర్పడింది. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్న భూగర్భ జలాలు అత్యంత లోతులోకి వెళ్లాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నీటి మట్టాలు తగ్గుతుండగా… రైతులు వేసిన పంట చేతికందడం లేదని వాపోతున్నారు.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి సాగు నీరు వస్తుందని చాలా మంది రైతులు వరినాట్లు వేశారు. కానీ ప్రాజెక్టు లో సరిపడా నీటి నిలువ లేకపోవడంతో అధికారులు నీటిని విడుదల చేయలేదు. అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశారు రైతులు. కానీ ఇప్పుడు పంట ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు చేసిన పంటకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Discussion about this post