సినిమాల్లోంచి ప్రజా సమస్యలపై పోరాడాలనే ఆలోచనలతో రాజకీయాల వైపు అడుగేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని కీలక నాయకుడిగా అవతరించారు. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో విజయాలు సాధించి ఒక్కో అడుగు వేస్తూ అసెంబ్లీ వైపు వరకు వెళ్లారు. పవన్ రాజకీయ ప్రస్థానంపై కథనం మీ కోసం…
సినిమాల్లో మొదటి నుంచి తన స్టైలిష్ మార్క్‌తో జనాల్లోకి వెళ్లిన పవన్… ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు… ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ… వాటన్నింటిని భరిస్తూ చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయనకు సంబంధించిన సినిమాలోని ఓ డైలాగ్ కూడా పక్కగా పవన్‌కు సరిపోయింది. కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో గానీ…రావడం మాత్రం పక్కా అనేది వాస్తవ రూపం దాల్చింది. అధ్యక్షా అని పిలవడానికి పదేళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న పవన్‌ను పడగొట్టాలనుకున్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వ్యక్తిగతంగా తూలనాడారు… వాళ్ల విమర్శలను ఏ మాత్రం పవన్ లెక్క చేయలేదు… కొన్ని సార్లు తనదైన శైలిలో విమర్శలు చేశారు. తన ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్.. ప్రజాభిమానంతో ఏపీ రాజకీయ యవనికపై సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. పదేళ్లు పదవి, అధికారం వంటివి లేకుండా ‘అజ్ఞాతవాసం’లాంటి జీవితం సాగించిన పవన్ ఇప్పుడు.. అధ్యక్షా అంటూ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.
సినిమాల్లో పవన్‌కు ఉన్న ఇమేజ్ మాములుది కాదు… ఆయన తలుచుకుంటే నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. దర్శకులు ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తారు. సూట్ కేసులతో డబ్బులే డబ్బులు. విలాసవంతంమైన జీవితం, ఫారిన్ ట్రిప్పులు… వీటన్నింటిని పక్కన బెట్టారు. ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒంటిరిగా పోరాడితే ప్రజలకు న్యాయం చేయలేనని భావించి చంద్రబాబుతో కలిశారు… ఎన్డీయేతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించారు.
మొదటి సారి పోటీ చేసినప్పుడు పవన్‌కు ఎదురు గాలి వీచింది..2014లో టీడీపీకి మద్దతు తెలిపిన పవన్ 2019లో టీడీపీకి దూరమయ్యారు. ఆ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో కలిసి పోరాడి ఓడారు. అప్పట్లో ఒకే ఒక్క స్థానంలో గెలుపొందారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీని వదిలించుకునేందుకు చూసేవాడు. కానీ అక్కడున్నది పవన్ కల్యాణ్. తనతో పాటు, పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా చేశారు. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడినా పెద్దగా విమర్శలు చేసింది కూడా లేదు. ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు.
ఓడిపోయినా తనలో ఎలాంటి నిరుత్సాహం లేకుండా ముందుకు సాగారు.. తన టీం మొత్తం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు సరైన కార్యాచరణతో ముందుకు కదిలారు. వైసీపీ గెలిచిన ఏడాది పాటు ఎలాంటి విమర్శలు చేయకుండా విజ్ఞత ప్రదర్శించారు. ఆ తర్వాత విమర్శలు గుప్పించారు.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటో ఎండగట్టారు. సామాన్యుల తరపున అసామాన్యుడిగా దూసుకెళ్లారు… ఎంతో మంది అభిమానులు ఆయన్ను సీఎం.. సీఎం అని అన్నారు… వాటికి వినమ్రంగా తనను ముందు గెలిపించాలని కోరారు. ఇది కేవలం పవన్‌కు మాత్రమే సాధ్యమనొచ్చు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే.. తన పార్టీ ఫండ్‌తో ఆ కుటుంబాలకు ఆర్థికసాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలవడంలో పవన్‌కల్యాణ్‌ది కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెప్పారు. తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జగన్ దాడిని ఒంటరిగా ఎదుర్కొంటున్న టీడీపీకి స్నేహ హస్తం అందించారు. తన పార్టీ వర్గాలతో పాటు, తన సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు సైతం టీడీపీతో చేయి కలపడాన్ని ఆక్షేపించారు. సైద్ధాంతికపరంగా తమ మధ్య కొన్ని వైరుధ్యాలున్నా, వైసీపీ అరాచక పాలన అంతం చేయడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావనతో పవన్ తానే ఒక అడుగు ముందుకువేశారు. ఇందులోభాగంగానే టీడీపీ, బీజేపీల మధ్య సయోధ్య కుదిర్చి ఏపీలో ఎన్డీయే కూటమి ఏర్పడటానికి సూత్రధారి, పాత్రధారి అయ్యారు. ఆ ప్రయత్నం నేడు ఏపీలో ఫలించి కూటమి విజయానికి ప్రధాన కారణమైంది.
2024 ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌కు ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్ల సర్దుబాటు. టీడీపీతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అని. ఎన్నికలకు ముందు టీడీపీకు ఎదురైన గడ్డు పరిస్థితులను తనకు అవకాశంగా మలుచుకోలేదు సరికదా.. ఆ పార్టీకి మద్దతు ప్రకటించి అండగా నిలబడ్డారు. ఈ దశలో పవన్‌కల్యాణ్ ఎన్ని సీట్లు అడగాలో ప్రతిఒక్కరూ సలహాలిచ్చేవాళ్లే. కానీ, ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో పవన్‌కల్యాణ్‌కు బాగా తెలుసు. తన బలాన్ని, బలగాన్ని సరిగ్గా అంచనా వేసి, తక్కువ సీట్లు తీసుకుని, అన్ని స్థానాల్లో గెలవాలన్న అజెండాతో ముందుకువచ్చారు. ‘ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు. స్ట్రైక్‌రేట్ ముఖ్యం’ అంటూ శ్రేణులను సముదాయించడంతో పాటు, విమర్శలకు దీటైన జవాబిచ్చారు. తన డిమాండ్ వల్ల కూటమి, తన రాజకీయ లక్ష్యం దెబ్బతినకూడదని ఒక అడుగు వెనక్కి వేశారు. నిరాశపడిన జనసేన శ్రేణులకు సర్ది చెబుతూ, ముందుగా ఏపీలో జనసేన గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీగా అవతరించాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయడమే కాదు.. ఈ ఎన్నికల్లో 20కి పైగా సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెర తీశారు.
ఏది ఏమైనా పవన్ నిజమైన సింహం అనొచ్చు… స్లో అండ్ స్టడీగా తాను అనుకున్న దాంట్లో విజయం సాధించారు. ఈ గెలుపుతో కేవలం ఆయన అభిమానులే కాకుండా ప్రజల మనసులో కూడా స్థానం సంపాదించాడనచ్చు… ఈ విజయంతో అధికారాన్ని తలక్కెక్కించుకోకుండా. జనాలకు మంచి చేస్తూ ఇలాంటి విజయాలను ఎన్నో సొంతం చేసుకోవాలని కోరుతున్నారు… రాజకీయాల్లో తన పవర్‌ను మరింత పెంచుకోవాలని కోరుతున్నారు.
Discussion about this post