ప్రకాశం జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ పెద్దల జమానా తెర వెనుక మంత్రాంగంతో గ్రానైట్ దొంగలు రాజ్యమేలుతున్నారని, వేల కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ ను అక్రమంగా తరలించుకుపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ చెల్లించకుండా.. అనుమతులిచ్చిన భూమికి మించి ఎక్కువ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ వందలాది కోట్లు గడిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అక్రమ మైనింగ్ చేసినందుకు విధించిన అపరాధ రుసుం 1200 కోట్ల రూపాయలను పరిశ్రమలు ఎగ్గొట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. మైనింగ్ మాఫియా డాన్లుగా కొందరు ప్రభుత్వ పెద్దలే వ్యవహరిస్తున్నారని, ఏకంగా సీఎంఓ పాత్ర ఉందని చెప్పుకుంటున్నారు.
మైనింగ్ జరిగే ప్రాంతాల్లోకి మాఫియా అనుమతి లేకుండా చీమ కూడా అడుగుపెట్టలేదు. ఎవరైనా పొరపాటున వచ్చినప్పటికీ కళ్లూ.. చెవులు మూసుకుని వెళ్లిపోవాల్సిందే. సెల్ ఫోన్ తో సరదాకి ఫొటో తీసినా ప్రైవేట్ సైన్యం విరుచుకుపడి దాడి చేస్తుంది. వాస్తవానికి.. ప్రకాశం జిల్లా రెండు దశాబ్దాలకు క్రితం వరకూ ఉపాధికి కరువైన మెట్ట ప్రాంతం. స్థానికులు పొట్ట చేత పట్టుకుని మహా నగరాలకు వలస వెళ్లి జీవనం సాగించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక్కడి కొండ గుట్టల్లో ప్రపంచంలోనే మన్నికైన బ్లాక్ గాలక్సీ గ్రానైట్ ఉందని వెల్లడవడంతో ఉమ్మడి రాష్ట్రంలోని పెద్దలందరూ గద్దల్లా వాలిపోయారు. అక్రమ మైనింగ్ చేపట్టి కొండలను కరిగించేశారు. కోట్లకు పడగలెత్తారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అగ్ర నేతల కొమ్ము కాస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.
గ్రానైట్ దందాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయమే రంగంలోకి దిగి ప్రకాశం జిల్లాలోని మైనింగ్ ను పర్యవేక్షిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు పెద్దఎత్తున ప్రయోజనం కలిగేలా అధికారులను ఆదేశిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు 14 నెలల కిందట ప్రారంభించిన మైనింగ్ పై అధికారులు ఎడా పెడా దాడులు జరపటం విస్మయపరిచింది. ఆ నాయకుడు పార్టీ పెద్దలను ఎదరించడమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యం.
Discussion about this post