పూర్తవుతున్న రామ మందిర నిర్మాణం
వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్టకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది.
అయోధ్యలో రామ్ లల్లా ఆలయ నిర్మాణ పనులు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు పర్యవేక్షణలో చురుగ్గా జరుగుతున్నాయి.
దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విగ్రహాలను ప్రతిష్ఠించి రామ మందిరాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్మాణ కమిటీ నిర్ణయించింది.
జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవ వేడుక కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది.
త్వరలోనే ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుండటంతో, గర్భాలయ ఫోటోలను ట్రస్టు విడుదల చేసింది.
ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఎలాంటి సమస్యా లేదని…గర్భాలయం, లైటింగ్ ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయని ట్రస్ట్ ప్రకటించింది.
విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. కాగా ఇప్పటికే 3,000 మంది వీవీఐపీలు, పీఠాధిపతులు, డోనర్లు, రాజకీయ నాయకులతో సహా 7000 మందికి ట్రస్టు ఆహ్వానాలు పంపింది.
ఈ ఉత్సవానికి తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం టెంపుల్ టౌన్లో తగిన బస, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీరాముడు కొలువుదీరనున్న నూతన రామాలయంలో 20 మంది అర్చకులతో నిత్య పూజలను నిర్వహించనున్నారు.
వారందరికీ శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ శిక్షణ ఇస్తోంది. మొత్తంగా ఆ అయోధ్య రామయ్య సేవా భాగ్యాన్ని నోచుకునేందుకు భక్తి పారవశ్యంతో కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్నారు.
Discussion about this post