ఓ పంతొమ్మిదేళ్ల వయసున్న డేనియల్ జాక్సన్ అనే యువకుడు ఆస్ట్రేలియాలో పుట్టి, బ్రిటన్లో పెరిగి…తన పద్నాలుగేళ్ల వయసులోనే ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడు. అదెలా సాధ్యం అని అవాక్కవుతున్నారా? ప్రస్తుతం ఉనికిలో ఉన్న దేశాలకు అధ్యక్షుడు కావడం సాధ్యం కాదని తెలిసిన ఈ బాల మేధావి ఏకంగా తనదైన సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు.
ఐదేళ్ల కిందట ఆరుగురు మిత్రులతో కలసి సెర్బియా, క్రొయేషియాల మధ్య డాన్యూబ్ నది మధ్యలో ఆ రెండు దేశాలకూ చెందని ఖాళీ భూభాగాన్ని గుర్తించి, లేతనీలం, తెలుపు చారలతో సొంత జెండాను తయారు చేసుకుని, అక్కడ తన జెండా పాతేశాడు. జెండా పాతడానికి ముందే చాలా పరిశోధన సాగించి, ఈ భూభాగం చారిత్రకంగా ఎవరికీ చెందనిదని తేల్చుకున్నాడు. ఈ దేశానికి ‘వెర్డిస్’గా నామకరణం చేసి, దానికి తనను తానే అధినేతగా ప్రకటించుకున్నాడు. దీని విస్తీర్ణం 0.2 చదరపు మైళ్లు…అంటే 128 ఎకరాలు మాత్రమే… ఈ లెక్కన వాటికన్ నగరం తర్వాత రెండో అతిచిన్న దేశం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం నాలుగువందల మంది ఉంటున్న ఈ చిరుదేశంలో పౌరసత్వం కోసం ఇప్పటికే దాదాపు పదిహేనువేల మంది దరఖాస్తులు చేసుకున్నారు.
ఈ చిరుదేశాధినేత డేనియల్ ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కోసం తన దేశం తరఫున అధికారికంగా విరాళం పంపడం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలనుకుంటున్నామని, దేశాన్ని పౌరులతో కళకళలాడేలా తీర్చిదిద్దాలనేదే తన కోరిక అని డేనియల్ చెబుతున్నాడు. అయితే, పొరుగునే ఉన్న క్రొయేషియాతో ఈ చిరుదేశానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రొయేషియా భూభాగంలో పొరపాటున అడుగుపెట్టిన వెర్డిస్ పౌరులను క్రొయేషియన్ పోలీసులు బందీలుగా పట్టుకున్నారు.
అంతటితో ఆగకుండా, గత అక్టోబర్ 12న వెర్డిస్ భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న తమనందరినీ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమ భూభాగంలో విడిచిపెట్టారని, క్రొయేషియా చర్య అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని, దీనిపై తాము అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగిస్తామని డేనియల్ చెప్పాడు. రానున్న ఐదేళ్లలో తమ దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని అన్నాడు. బయటి నుంచి తమ దేశానికి చేరుకోవాలంటే, క్రొయేషియా భూభాగాన్ని దాటాల్సి ఉంటుందని, అందువల్లనే క్రొయేషియాతో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాడు.
Discussion about this post