మావోయిస్టులతో లింక్ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అంతులేని న్యాయపోరాటం చేశారు. బాంబే హైకోర్టు తాజా తీర్పుతో జైలు జీవితం నుంచి మార్చి 7న ఆయనకు విముక్తి లభించింది. అయితే హైకోర్టు తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో అప్పీల్ చేయనుంది.
మావోయిస్టులతో లింక్ కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా మార్చి 5న ప్రకటించింది. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు చేసిన అప్పీల్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై మోపిన కేసును కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన వినయ్ జోషి, వాల్మీకి ఎస్ఏ మెనెజెస్‌లతో కూడిన నాగపూర్ బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నిందితులపై కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ధర్మాసనం పేర్కొంది.
దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్నారని ఆరోపిస్తూ 90% వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబాను, మరో ఐదుగురిని 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసింది. కేసును విచారించిన గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో నిందితులకు జీవితఖైదు విధించింది. దీనిని బాంబే హైకోర్టులో సాయిబాబా సవాల్ చేయగా.. 2022, అక్టోబర్ 14న యావజ్జీవ ఖైదును రద్దు చేసింది. సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. అయితే తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుల విడుదలపై స్టే విధించింది.
యాభై నాలుగేళ్ల సాయిబాబా వీల్‌చైర్‌కే పరిమితమైన దివ్యాంగుడు. ఆయన పూర్తి పేరు గోకరకొండ నాగ సాయిబాబా. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలు కావడంతో 2021 ఫిబ్రవరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయనను తొలగించారు.
Discussion about this post