కౌంటింగ్ ప్రక్రియ కోసం విశాఖ జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులతో కలిసి జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీకి 14 టేబుల్స్, పార్లమెంటుకు 14 టేబుల్స్ చొప్పన ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తూర్పు, విశాఖ ఉత్తర, దక్షిణ, పశ్చి మ, గాజువాక, భీమిలి, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఏయూ ఆవరణలో నిర్వహించనున్నారు. ఏడు అసెంబ్లీలకు కలిపి మొత్తం 98 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పార్లమెంటుకు కూడా 98 టేబుల్స్ వేర్వేరు హాళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్‌కు ముగ్గుర్ని నియమిస్తున్నారు. సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంటు, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నారు. అలాగే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపునకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. 20 వేల ఓట్లు కోసం సుమారుగా 40 టేబుల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ టేబుల్స్ పార్లమెంటుకు, అసెంబ్లీకి వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సర్వీస్ మెన్ కోసం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ అన్ని పోస్టు ద్వారా వస్తున్నాయి. జిల్లాలో నాలుగు వేల వరకు పోస్టల్ బ్యాలెట్ వచ్చే అవకాశం ఉంది. వీటి కోసం మరో 15 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం మీద 291 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క టేబుల్‌కు ముగ్గురు చొప్పన 873 మంది సిబ్బంది అవసరం ఉంటుంది.
Discussion about this post