ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బస్సు డిపోల ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెయ్యి మంది మోదీలు, రేవంత్‌లు వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి మచ్చలేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని నమ్మకం వ్యక్తంచేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు రోడ్లపై బైఠాయించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నిజామాబాద్ పట్టణంలో జడ్పీ చైర్మన్ విఠాల్ రావు ధర్నాలో పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కేసిఆర్ ని టార్గెట్ చేసి కవితని అరెస్టు చేశారని మండి పడ్డారు. వరంగల్ జిల్లా తొర్రూర్ బస్సు స్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా కార్యక్రమం చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నుండి నిరసన ర్యాలీ జరిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఖమ్మం క్రాస్ రోడ్డులో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
Discussion about this post