కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీని వీడిన నేతలను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నేత మా అమ్మకు ఫోన్ చేసి సోనియాజీ ఈ వయస్సులో వారితో పోరాడే శక్తి నాకు లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది అని కన్నీటిపర్యంతమయ్యారు అని రాహుల్ చెప్పారు.
ముంబయిలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ మనం అధికారంతో పోరాడుతున్నాం. అందులో ఉన్న వ్యక్తులు ఈవీఎం, దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు కొందరు ఇటీవల బీజేపీలో చేరారు. వారిలో మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్రా శివసేనలో చేరారు. 48 ఏళ్లుగా పార్టీలో ఉన్న బాబా సిద్ధిక్ కాంగ్రెస్ నుంచి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
మణిపుర్‌లోని తౌబాల్ జిల్లాలో జనవరి 14న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 100కిపైగా జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాల మీదుగా కొనసాగింది. 63 రోజుల అనంతరం ముంబయి చేరుకుంది. దీనికి ‘ఇండియా’ కూటమికి చెందిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ గైర్హాజరయ్యారు. ఈ సభపై బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌తో నిలబడాలని ఎవరూ కోరుకోరని ఎద్దేవా చేసింది.
Discussion about this post