రూ.60 కోట్ల ప్రజాధనం వృథా
ప్రభుత్వం ఏదైనా .. నిర్లక్ష్యం మాత్రం అలాగే ఉంటుంది. కాలం మారినా.. ప్రభుత్వాల తీరు మారటం లేదు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించటం.. వినియోగించకుండా వదిలేయడం.. షరా మామూలే అయింది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ల సముదాయం. ఫినిషింగ్ పనులు పూర్తి చేయకుండా వదిలేయడంతో శిథిలమవుతున్న రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్లపై 4 సైడ్స్ టీవీ స్పెషల్ స్టొరీ…
మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2006లో అప్పటి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ‘రాజీవ్ స్వగృహ’ పేరుతో అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టింది. ఈ పథకం కింద ఖమ్మం జిల్లాలో 60 కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ భవనాలు చాలావరకు పూర్తయ్యాయి. చివరి దశ పనులు మాత్రం ఇప్పటికీ జరగలేదు. దీంతో అవి శిథిలమవుతున్నాయి. మరోవైపు లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.
ఉద్యోగులు, అధికారులు, మధ్యతరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చాలని 2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘రాజీవ్ స్వగృహ’, ‘రాజీవ్ గృహకల్ప’ పేర్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాజీవ్ గృహకల్ప కింద నిరుపేదలకు కొన్ని పట్టణాల్లో సింగిల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇచ్చారు. మధ్యతరగతి ఉద్యోగులకు మాత్రం ‘రాజీవ్ స్వగృహ’ పేరుతో సింగిల్, డబుల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం పట్టణాలు ఏజెన్పీ ఏరియాలో ఉండడంతో ఖమ్మంలోనే అందరికీ అపార్టుమెంట్లతో పాటు వ్యక్తిగత ఇళ్లు నిర్మించి ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. వేలసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కోసం కొందరు మాత్రమే మూడు వేలు, అయిదు వేలరూపాయల చొప్పున డిపాజిట్లు చెల్లించారు. తర్వాత పోలేపల్లిలో 16 ఎకరాల స్థలాన్ని అపార్టుమెంట్ల నిర్మాణానికి, రఘునాధపాలెం బైపాస్ రోడ్డు సమీపంలో వంద ఎకరాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేశారు.
ముందుగా పోలేపల్లిలో 16 ఎకరాల్లో 60 కోట్ల రూపాయలతో 288 త్రిబుల్ బెడ్‌రూం, 288 డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లతో అపార్టుమెంట్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 288 సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్లు ఉండే అపార్టుమెంట్ పనులు మాత్రం ప్రారంభించలేదు. 1450 ఎస్‌ఎఫ్‌టీతో త్రిబుల్ బెడ్‌రూం, 1,250 ఎస్‌ఎఫ్‌టీతో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మించారు. త్రిబుల్ బెడ్‌రూంకు స్వ్కేర్ ఫీట్ కు 1,480 రూపాయల చొప్పున మొత్తం ధర రూ.23.50 లక్షలుగా.. డబుల్‌బెడ్ రూంకు స్వ్కేర్ ఫీట్ 1,445 రూపాయల చొప్పున మొత్తం ధర 18.50 లక్షలుగా , సింగిల్ బెడ్‌రూం ధర ఎస్‌ఎఫ్‌టీకి 1,250 చొప్పున మొత్తం ధర 12.50 లక్షలుగా నిర్ణయించారు. మొత్తం ఎనిమిది బ్లాకుల్లో డబుల్ బెడ్‌రూం, త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు.
హైదరాబాద్ తరహాలో నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టినప్పటికీ అప్పట్లో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో లబ్ధిదారులు తమ వాటా సొమ్ము చెల్లించలేదు. అప్పట్లో ప్రైవేటు రంగంలో స్వ్కేర్‌ఫీట్ ధర 800 నుంచి 1000 రూపాయల వరకు ఉండడంతో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన సొమ్మును చాలామంది లబ్ధిదారులు వాపసు తీసుకున్నారు.
Discussion about this post