రామప్ప దేవాలయం… ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకలున్నాయి. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా కనిపిస్తోందీ ఆలయం… సాధారణంగా ఆలయాలను అక్కడ ప్రతిష్టించే దేవుని పేరుతో పిలుస్తారు… కానీ ఈ ఆలయాన్ని శిల్పి పేరుతో పిలుస్తారు. అంతటి ప్రత్యేకత కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం…
ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక రామప్ప దేవాలయం. ఉమ్మడి వరంగల్ జిల్లా… ప్రస్తుత ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఈ రామప్ప దేవాలయం ఉంది. రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన శిల్పి గౌరవార్థం ఆయన పేరిట రామప్పగుడి అని పేరు పెట్టారు. కర్నాటక ప్రాంతానికి చెందిన శిల్పిని రప్పించి ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల పాలనలో 13, 14శతాబ్దాల మధ్య కాలంలో ఇది నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.
కాకతీయ రాజుల్లో రేచర్ల రుద్రుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. క్రీ.శ.1213లో రామప్ప దేవాలయం నిర్మించినట్లు ఆలయ పూజారి వెల్లడించారు. కాకతీయ రుద్రదేవుడు ఆలయ నిర్మాణాన్ని చేపట్టగా, దేవగిరి దండయాత్ర వచ్చి నిర్మాణం నిలిచిపోయింది. అనంతరం రాజ్యాధికారానికి వచ్చిన గణపతిదేవుడు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ ప్రాంతానికి సామాంత రాజుగా రేచర్ల దుర్రుడు పాలన సాగిస్తున్నాడు. ఆయన కాకతీయ రాజులకు కప్పం చెల్లించాల్సి ఉండగా… కప్పం కింద ఆలయం నిర్మించాలని ఆదేశిస్తారు. దీంతో రేచర్ల దుర్రుడు కర్నాటక ప్రాంతం నుంచి రామప్ప అనే శిల్పిని రప్పించి నిర్మాణ పనులు మొదలు పెడుతాడు.
అయితే కర్నాటక ప్రాంతం నుంచి వచ్చిన రామప్ప అనే శిల్పి ఇక్కడ ఆలయాన్ని నిర్మించేందుకు వీలుగా గణపతి చక్రవర్తి బావమరిది అయిన వ్యాయాప సేనాని రచించిన ముత్య రత్నవళి, వాయిద్య రత్నావళి, గీత రత్నావళి అనే మూడు గ్రంథాలను ఆధారంగా చేసుకుంటూ… శిల్పాలను చెక్కాడు. ఇప్పుడు మనకు రామప్ప దేవాలయం వద్ద కనిపించే శిల్పాలన్నీ ఆ మూడు గ్రంథాల్లో చెప్పబడిన విషయాలను ఆధారం చేసుకొని చెక్కినవే. గ్రంథాల్లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని రామప్ప శిల్పి బహు ముచ్చటగా వాటికి కళారూపం ఇచ్చాడు. దీంతో ఆయన శిల్ప కళా వైభవానికి మెచ్చి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆయన గౌరవార్థం శిల్పి పేరుతోనే రామప్ప దేవాలయంగా నామకరణం చేశారు. అదే పేరు ఇప్పటికీ స్థిరపడి రామప్ప దేవాలయంగా పేరుగాంచింది.
ఎనిమిది శతాబ్దాల క్రితం నిర్మించిన రామప్ప దేవాలయం చూడాలంటే రెండు కల్లు చాలవన్నట్లు ఉంటాయి అక్కడ కనువిందు చేసే శిల్పాలు. శిలల్పి శిల్పాలుగా మార్చిన రామప్ప ఎనిమిది శతాబ్దాలుగా తన పేరును లక్షలాది నోట పలికించుకుంటున్నాడంటే… మనం ఈ శిల్ప కళా వైభవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతటి వైభవం కలిగింది కాబట్టే… యునెస్కో కూడా ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం కింద గుర్తింపు ఇచ్చింది. ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొంది జులై 25వ తేదీకి సరిగ్గా మూడేళ్లు గడుస్తోంది. నాటి శిల్ప కళా వైభవం మినహా… యునెస్కో గుర్తింపు తర్వాత ఇక్కడ జరిగిన ప్రత్యేక అభివృద్ధి ఏమీ లేదని ఆలయానికి వచ్చే పర్యాటకులు చెబుతున్నారు. దీన్ని అభివృద్ది చేసి మరింత మంది పర్యాటకులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
రామప్ప దేవాలయం శిల్ప కళా సందప సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఇక్కడ శిల్ప కళా వైభవమే యునెస్కో గుర్తింపు లభించేలా చేసింది. ఆలయంపై చెక్కబడిన శిల్పాలు చూడండి… ఎంత చక్కగా ఉన్నాయో… ప్రత్యేకించి ఈ శిల్పాన్ని చూడండి ముగ్గురు మనుషులు… నాలుగు కాళ్లు… కానీ… నాలుగు కాళ్లే… ఆరు కాళ్లుగా… ప్రతి ఒక్కరికీ రెండు కాళ్లు ఉండేలా నాటి శిల్పి రామప్ప చెక్కాడు. అలా చెప్పుకుంటూ పోతే… ఆలయంపై ఉన్న ప్రతి శిల్పం ఒక ప్రత్యేకతే. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే అంశం ఏమిటంటే… రామప్ప దేవాలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత నీరు బయటికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటయిన సోమసూత్రం మూసుకుపోయింది.
ఇప్పటి కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గతంలో పర్యాటక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్యను పురావస్తు శాఖాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాలతో మరమ్మతు పనులు చేపట్టారు. కానీ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం ఆలయంలో శివునికి అభిషేకం చేసిన తర్వాత బయటికి వెళ్లాల్సిన నీరు వెళ్లే మార్గం లేక ఒక డ్రమ్ము ఏర్పాటు చేసి అది నిండిన తర్వాత బయట పోస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి సోమసూత్రం మరమ్మతు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం ప్రత్యేకత.
Discussion about this post