సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, వివాహ వేదికలు ఇతరత్రా కార్యక్రమాలు వేటిని నిర్వహించాలన్న ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు రవీంద్ర భారతి. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న ఈ రవీంద్ర భారతి ఆడిటోరియం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. రవీంద్రభారతి అంటే ప్రేక్షకులకు కూడా ఒక క్రేజ్. ప్రేక్షకులకే కాదు కార్యక్రమాల నిర్వాహకులకు ఆ వేదిక అంటే మోజు. రవీంద్రభారతిలో కార్యక్రమాలు చేస్తున్నారంటే అదొక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. అందుకే అడ్వాన్సుగా ఆడిటోరియం బుక్ చేసుకుంటారు.
కళాప్రియుల మనోధామంగా పేరుగాంచిన ఈ రవీంద్రభారతి , జానపద, శాస్త్రీయ కళాప్రదర్శనలు, నాటకం, సినిమా ఆధునిక కళారీతులకు ఆలవాలం అని చెప్పుకోవచ్చు .’రవీంద్రభారతి’ ప్రతిష్టాత్మకమైన ఇంటాక్ హెరిటేజ్ అవార్డ్ ను కూడా గెలుచుకుంది.
ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా రవీంద్రభారతిలో కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు.. ఈ ఆడిటోరియం లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి ఆధ్వర్యంలో నడిచే వివిధ కళాశాలల నిర్వహణకు ఉపయోగిస్తుంది. భాషా సంస్కృతి ఆధ్వర్యంలో నడిచే ఆరు కళాశాలలు మూడు హైదరాబాద్ లో, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి లలో ఒక్కటి చొప్పున ఉన్నాయి. వీటిలో కూచిపూడి, భరత నాట్యం, కథక్, మృదంగం, డోలు, ఫ్లూట్, తబలా వాయిద్యం లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఈ కళాశాలల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం ..భాషా సంస్కృతి విభాగం పర్యవేక్షణలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నియామకాలు సైతం ఆ శాఖ డైరెక్టర్ నిర్వహిస్తారు.. అలాగే రవీంద్ర భారతి లో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలను ఆ శాఖ డైరెక్టరే నిర్వహిస్తారు.
ప్రస్తుతం ఈ సంస్థకు ఒక డైరెక్టర్ ఉన్నారు . 2014 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన ఆ డైరెక్టర్ 2024 వరకు కొనసాగుతూ ఉండడం ఆశ్చర్యం .ప్రభుత్వ నియమావళి ప్రకారం ఏ సంస్థ డైరెక్టర్ అయినా 4 ఏళ్ళ కన్నా ఎక్కువ ఆ పదవిలో ఉండకూడదు ..ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అదే శాఖలో .. అదే పోస్ట్ లో దశాబ్ద కాలంగా ఒకే వ్యక్తి కొనసాగడం చిత్రం .. ప్రభుత్వం మారినా ఈ డైరెక్టర్ మారలేదు . ఎవరూ కూడా పట్టించుకోలేదు.
Discussion about this post