భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇవాళ కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. ఏడవ సారి కూడా రెపో రేటును మార్చలేదు. రెపో రేటును 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రెపో రేటు యథాతథంగా ఉంచేందుకు ద్రవ్య పరపతి కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక వృద్ధి గాడిలో పడిందన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉందన్నారు. డిసెంబర్ 5.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రెండు నెలల్లోనే 5.1 శాతానికి తగ్గినట్లు ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకువచ్చే ప్రక్రియలు కొనసాగుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. జీడీపీ అంచనాల గురించి కూడా శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. 2024-25 సంవత్సరానికి చెందిన జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. రిస్క్‌లన్నీ ప్రస్తుతం సమతుల్యంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
Discussion about this post