RCB VS GT ఫైనల్ గెలిచేదెవరు..? | 🔥FINAL RCB vs GT – Who Will Win IPL 2026?

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరింది. విజేతను నిర్ణయించే ఫైనల్ పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ చేరుకున్నాయి.

రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను ఓడించిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా, ఇప్పటికే క్వాలిఫయర్-1లో అద్భుత విజయం సాధించిన ఆర్సీబీ టైటిల్ పోరుకు సిద్ధంగా ఉంది. దీంతో ఈసారి ఫైనల్ మరింత రసవత్తరంగా మారింది.

అయితే ఈ ఫైనల్‌ను కేవలం ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ గా మాత్రమే చూడటం లేదు క్రికెట్ అభిమానులు. సోషల్ మీడియా ట్రెండ్స్, ఫ్యాన్ వార్స్ గమనిస్తే ఇది కాస్త విరాట్ కోహ్లీ వర్సెస్ శుభ్‌మన్ గిల్ అన్న స్థాయికి వెళ్లిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌లో ఒక లెజెండ్. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు చెప్పిన విరాట్ ప్రస్తుతం వన్డేలు, ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్ భవిష్యత్తుగా కనిపిస్తున్నాడు. రాబోయే వరల్డ్ కప్‌లను దృష్టిలో పెట్టుకుని గిల్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్ల చుట్టూ కొత్త జట్టును నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నాడు కోచ్ గంభీర్.

ఇక్కడే ఫ్యాన్స్ మధ్య గమ్మత్తయిన వైఖరి కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తరానికి చెందిన అభిమానులు ఇప్పటికీ ఆ ఇద్దరినే భారత క్రికెట్‌కు ప్రధాన ముఖచిత్రాలుగా చూస్తున్నారు. మరోవైపు యువ ఆటగాళ్లను ప్రోత్సహించే వర్గం గిల్ వంటి ఆటగాళ్లలో భారత క్రికెట్ భవిష్యత్తును చూస్తోంది. దీంతో గిల్ కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్, విరాట్ ఉన్న ఆర్సీబీ మధ్య పోరు సహజంగానే ఆసక్తికరమైన ఫ్యాన్ వార్ గా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రెండ్ కూడా అదే.

తటస్థ అభిమానుల్లో చాలామంది ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నారు. అందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. ఎన్నో సంవత్సరాలుగా ఆర్సీబీకి సేవలందించిన కోహ్లీ మరోసారి కప్పు గెలవాలని చాలామంది కోరుకుంటున్నారు. మరోవైపు గిల్ అభిమానులు మాత్రం ఇది కొత్త తరం ఆధిపత్యాన్ని చాటే అవకాశం అని భావిస్తున్నారు. అయితే భావోద్వేగాలు, ఫ్యాన్ వార్స్ పక్కన పెడితే మైదానంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ సీజన్‌లో రెండు జట్లు కూడా సమతూకంగా కనిపించాయి. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ బలమైన కాంబినేషన్లతో ఫైనల్‌కి చేరాయి. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, పడిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బౌలింగ్‌లో హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. గిల్, సాయి సుదర్శన్, బట్లర్ వంటి బ్యాటర్లతో సిరాజ్, రబాడ, హోల్డర్ లాంటి మేటి బౌలర్లు వున్నారు. మొత్తానికి ఈ ఫైనల్‌లో ఒకవైపు విరాట్ అనుభవం, మరోవైపు గిల్ యువతరం నాయకత్వం చూడొచ్చు.

ఒకవైపు అభిమానుల భావోద్వేగం, మరోవైపు భవిష్యత్తు భారత క్రికెట్‌కు ప్రతీకగా మారుతున్న యువ కెప్టెన్. అందుకే ఈ పోరు కేవలం ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ మాత్రమే కాదు… అభిమానుల దృష్టిలో విరాట్ వర్సెస్ గిల్ కూడా. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. రెండు జట్లూ ఇప్పటికే ఒక్కో ఐపీఎల్ టైటిల్ గెలిచాయి. ఆర్సీబీ గత ఏడాది తొలిసారి కప్పు గెలిస్తే, గుజరాత్ తన ఆరంభ సీజన్‌లోనే టైటిల్ సాధించింది. ఇప్పుడు రెండో టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. అంటే ఫైనల్ గెలిచిన జట్టు రెండు టైటిళ్ల క్లబ్‌లో చేరడమే కాకుండా, ఐపీఎల్‌లో కొత్త ఆధిపత్యాన్ని అందుకోనుంది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top