ఐటీ హార్డ్ వేర్, టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయా? దేశంలోని అన్ని ప్రాంతాల్లో వీటి ధరలు పెరిగేందుకు అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఎర్ర సముద్రంలో సరుకు రవాణాచేసే షిప్ లపై హౌతీల దాడులే కారణం. ఎర్ర సముద్రంలో తలెత్తిన ఘర్షణలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. దీంతో.. షిప్పింగ్ కంటైనర్ల కొరత, చైనా నుంచి వచ్చే వస్తువులపై, ముడి సరుకు రవాణా ఛార్జీల పెంపు కారణంగా భారత్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుదారుపై రానున్న రోజుల్లో మరింత భారం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధానికి నిరసనగా గతేడాది నవంబర్ నుంచి నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ లకు చెందిన నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులకు తెగబడుతున్నారు. కొద్దిరోజులు దాడులకు విరామం ఇచ్చినట్లేఇచ్చిన హౌతీలు ఇటీవల మరోసారి దాడికి పాల్పడ్డారు. భారత్ వస్తున్న ఆండ్రోమెడా స్టార్ అనే చమురు ట్యాంకర్ నౌకపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడికి తెగబడ్డారు. రష్యాలోని ప్రిమోర్క్స్ నుంచి గుజరాత్ లోని వడినార్ కు నౌక వస్తుండగా హౌతీలు క్షిపణితో దాడి చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనీయులకు మద్దతుగా వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నట్లు యెమెన్ హౌతీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గత రెండు నెలల్లో కొన్ని చోట్ల సరుకు రవాణా ఖర్చు దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులకు ముందు.. నౌకలు అమెరికా, యూరప్ కు చేరుకోవడానికి సూయాజ్ కెనాల్ మార్గంలో వెళ్లేవి. యెమన్ లో ఎక్కువ భాగం హౌతీల చెరలోనే ఉంది. ఇక యెమన్ లోని ఎర్రసముద్ర తీర ప్రాంతం మొత్తాన్నీ హౌతీలే నియంత్రిస్తున్నారు. ఆసియా, యూరప్ మధ్య సముద్ర రవాణాకు ఎర్ర సముద్రమే అత్యంత దగ్గరదారి. అంతర్జాతీయ సముద్ర వర్తకంలో కనీసం 15శాతంకుపైగా ఎర్రసముద్రం మీదుగా మధ్యధరా సముద్రం, సూయాజ్ కాల్వ గుండానే సాగుతుంది. హౌతీలు ఈ మార్గంలో సరుకు రవాణాచేసే నౌకలపై దాడులకు పాల్పడుతుండటంతో.. ఆ సంక్షోభం నుంచి తప్పించుకోవాలంటే వేరే మార్గం ద్వారా అంటే.. దాదాపు 8500 కిలో మీటర్లు దూరం ప్రయాణించాల్సివ స్తుంది. దాదాపు 330 పెద్ద నౌకలు ఇదే మార్గాన్ని అనుసరించాయి. వీటిలో సుమారు 12వేల కంటైనర్లు ఉన్నాయి. దీంతో మే నుంచి చైనా పోర్టుల్లో వాణిజ్య నౌకల కొరత ఏర్పడింది. అదేకాక.. కంపెనీలు తమ తయారీ పద్దతులను కూడా మార్చుకోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.
Discussion about this post