తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ ప్రేమ జంట నర్సీపట్నం పోలీసులను ఆశ్రయించింది. విశాఖపట్నంలో తాము ఉండగా కొంతమంది దాడి చేసి కొట్టారని, వారి నుండి తప్పించుకుని నర్సీపట్నంలోని ఓ లాడ్జికి చేరుకోగా అక్కడికి కూడా వచ్చి కొట్టారని బాధితులు విలేకరుల ముందు వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని సిఐ కాంత్ కుమార్ ను కోరారు. ఆయన వీరిని విశాఖ కంచరపాలెం పోలీసుల వద్దకు పంపారు.
విశాఖపట్నం జిల్లా కంచరపాలేనికి చెందిన కోసపాటి చంద్రశేఖర్, విశాఖ ఎన్ఏడీ కాకాని నగర్ కు చెందిన కేనీది కీర్తన ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పకుండా ఫిబ్రవరి 14న తిరుపతిలో వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని కీర్తన తండ్రి అంగీకరించలేదు. చంద్రశేఖర్ పై కిడ్నాప్ కేసు పెట్టారు. అధికారికంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలని కొంతమంది చెప్పడంతో మార్చి 13న సింహాచలంలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమపై దాడులు చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని కీర్తన, చంద్రశేఖర్ కోరారు.
Discussion about this post