చింతలపూడి ఎత్తిపోతల పథకం… పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి మండలాల పరిధిలో సుమారు రెండు లక్ష్క్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు. 15ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో దీనికి శ్రీకారం చుట్టారు. అయితే చింతలపూడి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి నిర్వాసితులైన రైతులకు ఇప్పటికీ పరిహారం అందడం లేదు. రాష్ట్రం విడిపోయింది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో రెండు పార్టీలు చెరోసారి అధికారం చేపట్టాయి. తాజాగా టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది.
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 2008లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పట్లో తాడిపూడి నుంచి తమ్మిలేరు రిజర్వాయర్ వరకు మాత్రమే డిజైన్ రూపొందించి 1,701 కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి మండలాల పరిధిలో దాదాపు రెండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
అయితే నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ అకాల మరణం, అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారడం… రాష్ట్ర విభజన కోసం ఉద్యమం నడవడంతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ముందుకు వెళ్లలేకపోయాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన ఏపీలో నాటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం చింతలపూడి పథకాన్ని విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన హామీ ఉండటం… ఫలితంగా ఆ పనులు వేగం పుంజుకోవడంతో చింతలపూడి పథకాన్ని మరింత విస్తరించాలని 2016లో సంకల్పించారు. కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2.80లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు పలు గ్రామాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు.
ప్రాజెక్టును విస్తరించి 1,700కోట్ల రూపాయల అంచనాలను సవరించి 4,909కోట్ల రూపాయలకు ప్రాజెక్టు వ్యయాన్నిపెంచారు. తద్వారా 53.5 టీఎంసీల వరద జలాలను ఎత్తిపోసి 4.80 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాలు, కృష్ణా జిల్లాలోని 18 మండలాల పరిధిలో సాగునీరు, అదే విధంగే 281 గ్రామాలకు తాగునీటి సరఫరా చేయాలన్నది కూడా ఆ తాజాగా విస్తరించిన ప్రాజెక్టు లక్ష్యం. ఆ పనుల కోసం నాటి సీఎం చంద్రబాబు నాయుడు 2017 సెప్టెంబరు 17న శంకుస్థాపన చేశారు. అప్పటి జల వనరుల మంత్రి దేవినేని ఉమా ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పనులు శరవేగంగా నడిచాయి.
చింతలపూడి ఫేజ్-1 కాలువ తాడిపూడి నుంచి చింతలపూడి మండలం యర్రగుంటపల్లి వద్ద ముగుస్తుంది. ఫేజ్-2లో యర్రగుంటపల్లి నుంచి 13.8 కి.మీ. కాలువ తవ్వి చాట్రాయి వద్ద వేంపాడు మేజర్ కాలువకు గోదావరి జలాలను అనుసంధానం చేస్తారు. చాట్రాయి నుంచి రామచంద్రాపురం హెడ్రెగ్యులేటర్ వరకు వేంపాడు మేజర్ కాలువను 18 మీటర్లకు విస్తరించేలా డిజైన్ చేశారు. కానీ 2019 లో ఎన్నికలు రావడంతో పనులు నెమ్మదించాయి. తర్వాత వైసీపీ అధికారానికి రావడంతో ప్రాథాన్యాలు మారిపోయాయి. ప్రాజెక్టుకు గడ్డుకాలం వచ్చింది. 2021 డిసెంబరులో పనుల పునఃప్రారంభానికి నిర్ణయించారు. కాంట్రాక్టరు, ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులకు పరిహారం అందకపోవడంతో ప్రాజెక్టు ముందుకు వెళ్లలేక పోయింది.
టీడీపీ హయాంలో 4,909.90కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన పనులు పరుగులు పెట్టాయి. 50 శాతానికి పైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట ఏడాది పాటు పనులు ఆపేసింది. అప్పటికే 3,356.87 కోట్ల రూపాయల పనులు జరిగాయి. 2020-21లో వైసీపీ సర్కారు 88.49 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన బిల్లులు 1,464కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. మంజూరు చేసిన రుణంలో కొంత బిల్లులకు సర్దుబాటు చేసినప్పటికీ పనులు చేయాలంటే భూ సేకరణ అడ్డంకిగా మారింది. నిర్వాసితులైన రైతులకు 200కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ము ప్రభుత్వం ఇవ్వకపోవడంతో భూసేకరణ జరక్క పనులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఒక్కపైసా ఇవ్వలేదు.
పశ్చిమ గోదావరి జిల్లాలో సేకరించిన భూములకు 150 కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. అక్కడ ఇంకా 500 ఎకరాల భూమి సేకరించాల్సి కూడా ఉంది. వైసీపీ సర్కారు ఉదాసీనత కారణంగా పరిహారం చెల్లింపుల్లోనూ… తదుపరి భూసేకరణలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. తాజాగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూమిని కోల్పోయిన రైతులకు తమకు న్యాయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై నిర్వాసిత రైతులు ఫోర్ సైడ్స్ టీవీని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. చూడాలి మరి టీడీపీ ప్రభుత్వం చింతలపూడి ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలబడతుందో? లేదో?
Discussion about this post